గోదావరిఖని: మారుపేర్ల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చే విషయంపై
సింగరేణి యాజమాన్యం సీరియస్‌గా ముందుకు సాగుతోంది. సంస్థ వ్యాప్తంగా సుమారు 300 మంది మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించే అంశంపై కసరత్తు చేస్తోంది. వాస్తవ నిబంధనల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలి? ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి? గతంలో ఎలాంటి పద్ధతులు అనుసరించారు? అనే అంశాలపై సంబంధిత శాఖ అధికారులు ఫైల్ సిద్ధం చేస్తున్నారు. అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వన్‌టైం సెటిల్‌మెంట్ విధానం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనను యాజమాన్యం
సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సింగరేణి వ్యాప్తంగా ఎంతమంది మారుపేర్ల డిపెండెంట్లు ఉన్నారు? వారిలో ఏయే పరిస్థితుల్లో ఉద్యోగం ఇచ్చే ఫైల్ పెండింగ్‌లో ఉంది? వీరిలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇవ్వవచ్చు? అనే విషయంలో సంబంధిత అధికారుల నుంచి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు రావడంతో అధికారులు ఫైల్ సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 300 మంది వరకు మారుపేర్ల కార్మికులు ఉన్నట్లు అంచనా. వారి సర్వీసు వివరాలు, అర్హతలు, ఇతర అంశాలను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించనున్నట్లు సమాచారం.
సీఎండీ, డైరెక్టర్(పా) పరిశీలనకు ఫైల్
సేకరించిన వివరాలతో ప్రత్యేక ఫైలును సిద్ధం చేసి సింగరేణి సీఎండీ, డైరెక్టర్ (పా) పరిశీలనకు ఉంచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ఉద్యోగాలు కల్పించే అంశంలో సాధ్యాసాధ్యాలు, నిబంధనలు, సంస్థపై పడే ప్రభావం తదితర అంశాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలుస్తోంది.
సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూపులు
వన్‌టైం సెటిల్‌మెంట్ ప్రతిపాదనకు సింగరేణి యాజమాన్యం ఆమోదం తెలిపితే సుమారు 300 మంది మారుపేర్ల కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అనేక ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కుటుంబాల్లో కొత్త జీవితం ప్రారంభం కానుంది. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది సింగరేణి కార్మిక వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


