పెద్దపల్లి: బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతోపాటు ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు జిల్లా విద్యాశాఖ కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన 48 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రాణీలక్ష్మీబాయి కరాటే శిక్షణ తరగతులు నిర్వహించనుంది. గతంలోనే పీఎంశ్రీ పాఠశాలల్లో శిక్షణ ఇప్పించిన విషయం తెలిసిందే. ఈనెల 16న శిక్షణ ప్రారంభించి మూడు నెలల పాటు కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలికలు అధికంగా ఉన్న స్కూళ్లలో..
కనీసం 50 మంది బాలికలు ఉన్న ఉన్నత పాఠశాలలను శిక్షణ కోసం ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.30 వేల చొప్పున కేటాయించారు. మొత్తం 36 తరగతుల ద్వారా ప్రాథమిక మెలకువలు, ఆత్మరక్షణ పద్ధతులను నిపుణులైన మాస్టర్లు నేర్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకులాలు, మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో 5,677 మంది విద్యార్థినులకు కరాటేలో శిక్షణ ఇవ్వనున్నారు. దీనిద్వారా బాలికలు శారీరకంగా దృఢంగా ఉండటంతోపాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.
నిపుణుల ఎంపిక పూర్తి
ప్రభుత్వ పాఠశాలల్లో రాణీలక్ష్మీబాయి కరాటే శిక్షణ కార్యక్రమం గతంలోనూ కొనసాగింది. కరోనా సమయంలో నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని 2022–23లో తిరిగి ప్రారంభించారు. అయితే గత విద్యా సంవత్సరంలోనూ శిక్షణ నిలిచిపోవడంతో ఈసారి మళ్లీ నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.


