మంత్రపురి ఆలయాల్లో కార్తీక సందడి | - | Sakshi
Sakshi News home page

మంత్రపురి ఆలయాల్లో కార్తీక సందడి

Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM

● నెల పాటు శివనామస్మరణ.. గోదావరి తీరాన ప్రత్యేక పూజలు

మంథని: కార్తీకమాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడనున్నాయి. శివనామస్మరణలు, అభిషేకాలు, దీపారాధనలు, ప్రత్యేక పూజలతో నెలరోజుల పాటు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి.

చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన మంథని పట్టణం మంత్రపురిగా పేరుగాంచింది. ఇక్కడ కొలువుదీరిన శ్రీభిక్షేశ్వరస్వామి, శ్రీగౌతమేశ్వర స్వామి ఆలయాలు భక్తుల విశేష ఆదరణ పొందుతున్నాయి. గోదావరి నదీతీరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో కార్తీక మాసానికి మరింత ప్రత్యేకత ఉంది. పవిత్ర గోదావరిలో స్నానమాచరించి స్వామివార్లను దర్శించుకోవడం భక్తులు పుణ్యప్రదంగా భావిస్తారు. కార్తీకమాసంలో ఆలయాల్లో జరిగే అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు భక్తులను ఆకట్టుకుంటాయి.

గౌతమేశ్వరరుడు

మంథని పట్టణ సమీపంలో ప్రవహిస్తున్న గోదావరినది పక్కన ఎత్తైన ప్రదేశంలో ప్రాచీన కళ ఉట్టిపడుతుండేదే గౌతమేశ్వరాలయం. శతాబ్ద కాలం క్రితం ఈ ఆలయాన్ని వొజ్జల కిష్టయ్య అనే వ్యక్తి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం ఎన్నోసార్లు గోదావరి ఆటుపోట్లకు గురైనా చెక్కు చెదరకుండా ఉంది. ఆలయ ప్రాంగణంలోని పురాతన ఆలయాలు కొంత మేర దెబ్బతిన్నాయి. ఈ ప్రాంగణంలో శివపంచాయనం, రామాలయం, సరస్వతి, లక్ష్మీదేవి ఆలయాలు ఉన్నాయి.

పశ్చిమ ముఖంగల శివలింగం

దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పశ్చిమ ద్వారం, పశ్చిమ ముఖం కలిగిన శివలింగం మంథనిలో మాత్రమే ఉంది. భిక్షేశ్వరాలయంగా పిలువబడే ఈ ఆలయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతారు. శనిగ్రహ అనుకూలత కోసం పశ్చిమముఖ శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తే మంచి జరుగుతుందని ప్రతీతి.

ఓంకారేశ్వరాలయం

కాకతీయుల కాలంలో శివాలయంగా రూపుదిద్దుకున్న ఓంకారేశ్వరుని గుడి ప్రాచీన కాలంలో బౌద్ధ ఆలయమని చరిత్ర చెబుతోంది. పూర్వకాలంలో బౌద్ధ బిక్షువుల పూజల కోసం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. 35 అడుగుల ఎత్తైన గోపురంతో పాటు శివుని నల్లరాతి విగ్రహం ఈ గుడి ప్రత్యేకతలు.

శీలేశ్వర– సిద్ధేశ్వర ఆలయం

పట్టణ నడిబొడ్డున వెలసిన శీలేశ్వర–సిద్ధేశ్వరాలయం మంథని చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. కాకతీయ సైన్యాధీశుడు శీలప్పనాయుడు, సిద్ధప్పనాయుడు జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని ప్రోలరాజు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయంలో రెండు ఆలయాలు ఉన్నాయి. గర్భగుళ్లకు ఇరువైపులా నల్లరాతితో చెక్కిన నందీశ్వరులను, నాట్య మయూరిల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే శ్రీలక్ష్మీనారాయణస్వామి, దత్తాత్రేయస్వామి, మహాలక్ష్మీ, కన్యకా పరమేశ్వరి, సత్యసాయి మందిర్‌ వీటితో పాటు పట్టణంలో పదకొండు ఆంజనేయస్వామి, గణపతి, షిరిడిసాయి, అయ్యప్ప, రేణుకాఎల్లమ్మ, బాల వీరహనుమాన్‌, నాగదేవత, కాళీకాదేవి, గంగాదేవి, బద్ది పోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారని అనడానికి పట్టణంలోని ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు

గోదావరి తీరాన దీపాల వెలుగులు

మంథని గోదావరి తీరం కార్తీకమాసంలో భక్తి పారవశ్యానికి వేదికగా మారుతుంది. నదీతీరంలో దీపాలు వెలిగించడం, ఆలయాల సందర్శన, కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, పౌర్ణమి సందర్భంగా భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. కార్తీకమాసం ప్రారంభంతో నెలరోజుల పాటు శివనామస్మరణతో మంత్రపురి మార్మోగనుండగా.. గోదావరి తీరం దీపకాంతులతో భక్తి పారవశ్యంలో మునిగిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement