రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో సింగరేణి స్థాయి క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 11నుంచి 13వరకు స్థానిక ఠాకూర్ స్టేడియంలో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మందమర్రి –బెల్లంపల్లి సంయుక్త జట్టు, శ్రీరాంపూర్ జట్టు, ఇల్లెందు–మణుగూరు సంయుక్త జట్టు, ఆర్‌జీ–1, ఆర్‌జీ –2 సంయుక్త జట్టు, ఆర్‌జీ –3, భూపాలపల్లి సంయుక్త జట్టు, కొత్తగూడెం కార్పొరేట్ జట్టు పోటీల్లో పాల్గొననున్నాయి. లీగ్ పద్ధతిన ఠాకూర్ స్టేడియంతోపాటు మందమర్రి సింగరేణి స్కూల్ మైదానంలో నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే ఆరు జట్లను రెండు పూల్స్‌గా విభజిస్తారు. లీగ్ మ్యాచ్‌ల అనంతరం రెండు పూల్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడుతాయి. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం పోటీలు ప్రారంభం కానున్నాయి.
కోలిండియా పోటీలకు ఎంపిక..
పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను త్వరలో జరిగే కోలిండియా పోటీలకు ఎంపిక చేయనున్నారు. సుమారు 70 మంది ఆయా ఏరియాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననుండగా బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ వంటి అంశాల ఆధారంగా ప్రతిష్టాత్మక కోలిండియా పోటీలకు ఎంపిక చేస్తారు. పోటీలను పారదర్శకంగా నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎంపైర్లను రప్పిస్తున్నారు. ఆయా ఏరియాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు మందమర్రి సింగరేణి గెస్ట్‌హౌస్‌తోపాటు ఆయా కంపెనీ క్వార్టర్లలో బస ఏర్పాటు చేశారు. హోరాహోరీగా సాగే పోటీలను తిలకించేందుకు పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు, కార్మికులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశముంది.


