రామగిరి: పెన్షనర్లు లైవ్ సర్టిఫికెట్ సమర్పణ కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సీఎంపీఎఫ్ కమిషనర్ డాక్టర్ కె.గోవర్ధన్ సూచించారు. సోమవారం సెక్యూరిటీ కార్యాలయ ఆవరణలో కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ గోదావరిఖని శాఖ, ఆర్జీ–3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాల ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్–5.0ను జీఎంలు ఎం.రాంమోహన్, కె.నాగేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు. ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లు ఏటా నవంబర్‌లో లైవ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎంపీఎఫ్, సింగరేణి సంయుక్తంగా రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. పెన్షనర్లు మొబైల్‌లో ఉమంగ్ యాప్ ద్వారా కూడా లైవ్ సర్టిఫికెట్ సమర్పించుకునే అవకాశం ఉందన్నారు. క్యాంపు మంగళవారం కూడా కొనసాగుతుందని, పెన్షనర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం.రామచంద్రరెడ్డి, కోట రవీందర్‌రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, పర్సనల్ విభాగాధిపతి ఎండీ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.


