గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల్లో దశాబ్దాల పాటు శ్రమించి సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ కార్మికులకు దీపావళి పండుగ వేళ నిరాశ ఎదురవుతోంది. ప్రతినెలా అందాల్సిన సీఎంపీఎఫ్ పింఛన్ డబ్బులు నేటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన వేళ.. పింఛన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
యూనియన్ బ్యాంకు ఖాతాదారులకే సమస్య!
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు కలిగిన రిటైర్డ్ కార్మికులకే ఈసమస్య ఎదురైనట్లు కార్మికులు చెబుతున్నారు. ఎస్‌బీఐలో ఖాతాలు ఉన్న వారికి సకాలంలో జమఅయ్యాయి. సాంకేతిక సమస్యా? బ్యాంకింగ్ లావాదేవీల్లో జాప్యమా? లేక పింఛన్ చెల్లింపుల ప్రక్రియలో ఏదైనా ఆటంకమా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
30 వేల మంది ఎదురుచూపులు!
సుమారు 30 వేల మంది రిటైర్డ్ కార్మికులు సీఎంపీఎఫ్ పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. పింఛన్ సొమ్మే అనేక కుటుంబాలకు ప్రధాన జీవనాధారంగా ఉంది. మందులు, వైద్య ఖర్చులు, నిత్యావసరాలు, కుటుంబ అవసరాలకు ఈ డబ్బులే ఆధారం కావడంతో పింఛన్ ఆలస్యం ఆందోళనకు గురిచేస్తోంది.
అధికారులు స్పందించాలి..
దీపావళి పండుగకు ముందే పింఛన్ డబ్బులు అందుతాయని ఆశించిన రిటైర్డ్ కార్మికులకు నిరాశే మిగిలింది. ఈ సమస్యపై సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారులు, యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కార్మికులు కోరుతున్నారు.


