గోదావరిఖని: ఏడాదిలో పూర్తిస్థాయి మస్టర్లు చేసిన యువకార్మికులకు సింగరేణి దీపావళి శుభవార్త చెప్పింది. జనరల్ అసిస్టెంట్ ట్రెయినీలను జనరల్ అసిస్టెంట్లుగా పర్మినెంట్ చేస్తూ శుక్రవారం ఆదేశా లు జారీ చేసింది. సంస్థవ్యాప్తంగా 1,135 మందికి ఈ అవకాశం లభించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు వచ్చాయి. క్రమబద్ధీకరణ ఈఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమలు కానుంది. రెండు, మూడేళ్లుగా వేచి చూస్తున్న కార్మికులకు ఇది శుభవార్త.
అర్హతలు ఇవే..
2025 డిసెంబర్ 31 నాటికి లేదా అంతకుముందు చేరి బదిలీ వర్కర్, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న వారికి ఇది వర్తిస్తుంది. అంతకుముందు క్యాలెండర్ సంవత్సరంలో భూగర్భ గనిలో 190 ప ని దినాలు, ఓసీపీలు, డిపార్ట్‌మెంట్లలో 240 మస్టర్లు ఉన్నవారికి అవకాశం ఉంటుంది. సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశాలతో జీఎం(పర్సనల్) ఐఆర్ అండ్ పీఎం విభాగం సర్కులర్ జారీచేసింది. అర్హుల జాబితాలను ఈనెల 23వ తేదీలోగా సమర్పించాలని ఏరియా జీఎంలను కోరింది. అర్హులను 2026 సెప్టెంబర్ 1 నుంచి క్రమబద్ధీకరిస్తారు. విధుల్లో గైర్హాజరు లేకుండా క్రమశిక్షణతో పనిచేసిన వారికే ఈ అవకాశం లభించిందని, ఇలాగే పనిచేస్తే పదోన్నతులు, కంపెనీ సంక్షేమ ఫలాలు అందుతాయని, గైర్హాజరైతే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని యాజమాన్యం పేర్కొంది.


