ఐరన్‌ రాడ్ల రవాణాలో గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఐరన్‌ రాడ్ల రవాణాలో గోల్‌మాల్‌

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

● అక్రమంగా అమ్ముకుంటున్న డ్రైవర్‌తోపాటు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

● అక్రమంగా అమ్ముకుంటున్న డ్రైవర్‌తోపాటు కొనుగోలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

చౌటుప్పల్‌: లారీలో రవాణా చేస్తున్న ఐరన్‌ రాడ్లను అక్రమంగా అమ్ముకుంటున్న డ్రైవర్‌తోపాటు కొనుగోలు చేస్తున్న వ్యక్తిని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం హనుమంతునిపేట గ్రామానికి చెందిన పిట్ల సంతోష్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మేడ్చల్‌లోని అగర్వాల్‌ స్టీల్‌ కంపెనీ నుంచి నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ ప్లాంట్‌కు గురువారం ఐరన్‌ రాడ్ల లోడ్‌తో బయల్దేరాడు. లారీని విద్యుత్‌ ప్లాంట్‌కు తీసుకెళ్లకుండా మార్గమధ్యంలో చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి గ్రామానికి తరలించి పల్లె శేఖర్‌ అనే వ్యక్తికి 4 క్వింటాళ్ల ఐరన్‌ రాడ్లను అక్రమంగా అమ్ముకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు డ్రైవర్‌ సంతోష్‌తోపాటు ఐరన్‌ రాడ్లను కొనుగోలు చేసిన పల్లె శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సతీశ్‌రెడ్డి తెలిపారు.

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

గోదావరిఖని: స్థానిక అడ్డగుంటపల్లికి చెందిన కూలీ నాగపురి సంపత్‌కుమార్‌(47) బుధవారం ఉరివేసుకుని మృతి చెందాడు. భార్య ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఇంట్లో నుంచి స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటివెనకాల రూంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని కొనప్రాణంతో కనిపించాడు. వెంటనే చీరను విప్పి, భర్తకు ిసీపీఆర్‌ ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసి, ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. కొద్దికాలంగా అనారోగ్యతో ఇబ్బంది పడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య శ్రీవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

గంజాయి విక్రేతకు మూడేళ్ల జైలు

పెద్దపల్లిరూరల్‌: గంజాయి విక్రయిస్తూ 2021లో పట్టుబడ్డ ముత్తునూరి ప్రభాకర్‌ అనే వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల గురువారం తీర్పు ఇచ్చారని సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. పెద్దపల్లిలోని తిలక్‌నగర్‌కు చెందిన ప్రభాకర్‌.. గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా అప్పటి ఎస్సై రాజేశ్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది చేసిన తనిఖీలో 2కిలోల గంజాయి లభ్యమైంది. కేసు నమోదు చేసి రిమాండ్‌ కు పంపించారు. వాదోపవాదాలు పూర్తికాగా.. నేరం రుజువు అయ్యింది. దీంతో జిలా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డొంకెన రవి, ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, పోలీసు సిబ్బందిని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అభినందించారు.

బ్లేడ్‌ ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరు మృతి

సిరిసిల్ల అర్బన్‌: రాజన్నసిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రం పరిధిలోని చంద్రంపేట బైపాస్‌ చౌరస్తాలో గురువారం బ్లేడ్‌ ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు. కామారెడ్డి నుంచి ద్విచక్రవాహనంపై వేములవాడ మీదుగా కాళేశ్వరం వెళ్లేందుకు ఇద్దరు యువకులు బైక్‌పై వస్తున్నారు. అదే సమయంలో చంద్రంపేట బైపాస్‌ చౌరస్తా వద్ద యూ టర్న్‌ తీసుకుంటున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్‌ వంజా తలండి(30) ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందగా, మరొకరు విజయ్‌ లచ్చా వీరడి గాయపడ్డాడు. వీరిది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పత్తి గ్రామంగా గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement