ఇంటింటా వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు సర్వే ఏఎన్‌ఎంల పర్యవేక్షణలో లక్షణాల గుర్తింపు జిల్లాలో నేటితో ముగియనున్న సర్వే ప్రక్రియ
మంథనిరూరల్: కుష్ఠును ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తిస్థాయిలో నివారించాలనే లక్ష్యంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం పర్యవేక్షణలో ఆశ వర్కర్లు ఇంటింటా సర్వే చేస్తున్నారు. ప్రజల్లో అపోహలు తొలగించడంతోపాటు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆశ వర్కర్లు ఇంటింటా పర్యటించి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితులను పరిశీస్తున్నారు. అనుమానితుల వివరాలు నమోదు చేస్తున్నారు.
520 బృందాలతో సర్వే..
జిల్లాలోని 263 గ్రామాల్లోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో క్షేత్రస్తాయిలో కుష్ఠు గుర్తింపునకు 520 ఆశ వర్కర్ల బృందాలతో సర్వే ప్రారంభించారు. గతనెల 23 నుంచి ఈనెల 3వ తేదీ వరకు జిల్లాలోని 1లక్షా 34 వేల 322 కుటుంబాలను సందర్శించిన వైద్యసిబ్బంది.. 4 లక్షల 99 వేల 422 మందిని పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 5వ తేదీతో సర్వే ప్రక్రియ ముగియనుండటంతో గ్రామాల్లో ఆశ వర్కర్ల బృందాలు మరింత వేగంగా కుష్ఠు గుర్తింపు, లక్షణాల పరిశీలనను వేగవంతం చేసినట్లు తెలిపారు.
26మంది మాత్రమే..
పెద్దపల్లిని కుష్ఠు రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు చేసిన సర్వేలో 678 మందిని అనుమానితులుగా గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ముగ్గురికే కుష్ఠు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఈముగ్గురితో కలిపి 26మంది వ్యాధిగ్రస్టులు ఉన్నారని, వీరికి ఆయా ప్రాంతాల్లో వ్యాధి నివారణకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
వ్యాధిని గుర్తించడం ఇలా..
కుష్ఠు నిర్ధారణకు ఆశ వర్కర్లు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. శరీరంపై మచ్చలున్నాయా? వాటి రంగు, స్పర్శ లక్షణాలు ఎలా ఉన్నాయని నిశితంగా పరిశీలిస్తున్నారు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నరాల పనితీరులో మార్పులు వంటి లక్షణాలను గుర్తించి అనుమానితులను సమీపంలోని పీహెచ్‌సీలో వైద్యపరీక్షలు చేయించేలా చర్యలు చేపట్టారు.
ప్రారంభ దశలో గుర్తిస్తే..
కుష్ఠును ప్రారంభదశలో గుర్తిస్తే త్వరగా నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అనేకమంది లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేస్తుంటారని, ఇతరులకు తెలుస్తుందనే భయంతో వైద్యపరీక్షలకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. తద్వారా వ్యాధి ముదిరి అంగవైకల్యానికి దారితీసే ప్రమాదం ఉంటుందని, ఎలాంటి అనుమానిత లక్షణాలు ఉన్నా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. బహుళ ఔషధ చికిత్స ప్రతీ పీహెచ్‌సీలో అందుబాటులో ఉంటుందని, వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
ఆందోళన వద్దు
కుష్ఠు లక్షణాలు ఉంటే అపోహలతో ఆందోళన చెందవద్దు. వ్యాధిని నయం చేయడానికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బహుళ ఔషధ చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. వ్యాధి లక్షణాల గుర్తింపునకు ఆశ వర్కర్లు సర్వే చేస్తున్నారు. వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. కుష్ఠు రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం.
– రమేశ్, డీపీఎంవో


