పెద్దపల్లి: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు, సిబ్బంది కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె, నిరసన శనివారం కూడా కొనసాగింది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసనకు బీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందని మమతారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మణికేశ్వర్‌రెడ్డి, రత్నాకర్, సంతోష్‌కుమార్, నర్మద, మహేందర్, అంజలి, మమత, మౌనిక, రాజు, శ్రావణి, సింధు, స్కైలాబ్‌రాణి, అమూల్య, పద్మ, పోచం, నాయకులు ఉప్పు రాజ్‌కుమార్, కొయ్యడ సతీశ్‌గౌడ్, పూదరి చంద్రశేఖర్, బాలసాని శ్రీనివాస్, శ్యాంబాబు, గడ్డం శ్యామ్, శ్రీనివాస్, జక్కుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
‘గుండారం’ నుంచి నీటి విడుదల
కమాన్‌పూర్: గుండారం రిజర్వాయర్ నుంచి ఆర్‌ఎస్‌బీ కెనాల్‌కు శనివారం సాగునీటిని విడుదల చేశారు. సాగు చేసిన పంటలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎస్సారెస్పీ–83 కెనాల్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పైపులైన్ ద్వారా సాగునీటిని గుండారం రిజర్వాయర్‌లోకి విడుదల చేయించారు. రి జర్వాయర్‌లో నీటిమట్టం క్రమంగా పెరగడంతో మంథని, రామగిరి, ముత్తారం మండలా ల్లోని రైతుల ప్రయోజనాల కోసం సాగునీటిని విడుదల చేసినట్లు నాయకులు తెలిపారు. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతియాదవ్, కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, సర్పంచులు జంగిలి పోచాలు, రంగు సత్యనారాయణ, ఉప సర్పంచ్ రాజేందర్, నా యకులు ఆకుల ఓదెలు, అరెల్లి కొమురయ్య, ఆడ్వాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
వరి కోతలు షురూ
జూలపల్లి: సన్నవడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మరో పదిరోజులకు వరి పంట కోతకు వస్తుందని రైతులు చెబుతున్నా.. కొందరు వ్యాపారులు క్వింటాలుకు రూ.3,200 చొప్పున చెల్లించి రైతులతో ముందుగానే వరికోతలు కోయిస్తున్నారు. ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ వర్తింపజేస్తోంది. దీంతో చాలామంది రైతులు ఈసారి కూడా సన్న రకాల సాగు వైపే మొగ్గు చూపారు. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జూల పల్లి మండలంలో దాదాపు 8,516 ఎకరాల్లో చేసినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రభుత్వం సూచించిన వైరెటీలు, సూపర్‌ఫైన్ రకం సన్నరకాలు దాదాపు 80 శాతం వరకు ఉన్నాయని చెబుతున్నారు.
‘ఖని’ విద్యార్థిని ప్రతిభ
● సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీటు
గోదావరిఖనిటౌన్: చదువుకు పేదరికం అడ్డు కాదని.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా.. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే పట్టుదల ఉంటే చాలని గోదావరిఖని విద్యానగర్‌కు చెందిన సలిగంటి కావేరి నిరూపించింది. ఈమేరకు భారతీయ పరిశోధనా మండలి(ఐకార్) ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచింది. ఎస్సీ కేటగిరీలో 135వ ర్యాంక్‌తో ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ రాణిలక్ష్మీబాయి సెంట్రల్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందింది. విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి కమిటీ ఈమేరకు ప్రొవిజినల్ అడ్మిషన్ లెటర్ జారీచేశారు. 2026– 27 విద్యా సంవత్సరంలో సీడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ(విత్తన శాస్త్రం, సాంకేతిక విభాగం) పీజీకోర్సులో కౌన్సెలింగ్ ద్వారా కావేరికి సీటు దక్కింది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని.. జిల్లాలోని గర్రెపల్లి గురుకులంలో పదో తరగతి, నిజామాబాద్ గురుకుల కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. వ్యవసాయ విద్యలో ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో ముందు సాగుతున్న విద్యార్థినికి ఈ సీటు లభించడంపై తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


