జ్యోతినగర్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్ (క్యూఆర్‌ఈ) పరిధిలో ప్రయాణించే వారికి బస్సు, మెట్రో సేవలను అనుసంధానిస్తూ ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనితోపాటు ప్రయాణికుల కోసం ‘మీటికెట్’ మొబైల్ యాప్‌ను శుక్రవారం ప్రారంభించనుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ రోజుకు సుమారు 25 లక్షల మంది ప్రయాణికులను, హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలో సుమారు 4.50 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. బస్సు నుంచి మెట్రోకు, మెట్రో నుంచి బస్సుకు మారే ప్రయాణికులకు టికెట్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడం ఈ కామన్ పాస్ ప్రధాన ఉద్దేశం.
ఒకేపాస్‌తో బస్సు.. మెట్రో ప్రయాణం..
కామన్ పాస్‌తో తెలంగాణలోని అన్నిజిల్లాలు.. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రయాణికులు మెట్రో రైళ్లతో దానిపరిధిలోని ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. పుష్పక్ బస్సులకు పాస్ వర్తించదు. ప్రతిసారీ బస్సు, మెట్రోకు వేర్వేరుగా టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు. బస్సు–మెట్రో మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడంతోపాటు చివరి మైలు కనెక్టివిటీ సమస్య తగ్గించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. కామన్ పాస్ కొనుగోలు సమయంలో రూ.100 కార్డు ఫీజు వసూలు చేస్తారు. కార్డును తిరిగి అప్పగించినప్పుడు ఆ మొత్తాన్ని వాపసు చేయనున్నారు.
‘మీటికెట్’తో డిజిటల్ ప్రయాణం
కామన్ పాస్‌తోపాటు టీజీఎస్‌ఆర్టీసీ ‘మీటికెట్’ మొబైల్ అప్లికేషన్‌ను కూడా అందుబాటులోకి తీ సుకొస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఆధారిత సేవలను విస్తరించడం ద్వారా ఆర్టీసీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది.
పాస్ ధరలు(రూ.లలో)
పాస్ మెట్రోవాటా ఆర్టీసీవాటా మొత్తం
రోజువారీ 300 100 400
నెలవారీ 7,000 1,500 8,500


