తిమ్మాపూర్: పూర్వ విద్యార్థులు గురుభక్తి చాటుకున్నారు.తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుడికి ఉద్యోగ విరమణ సందర్భంగా ఖరీదైన కారు బహూకరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ డైట్ లెక్చరర్ గుర్రాల మహేశ్వర్‌రెడ్డి గతనెల 30న ఉద్యోగ విరమణ చేశారు. గురువారం తోటి అధ్యాపకులు, విద్యార్థులు వీడ్కోలు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా శిష్యులు, పూర్వవిద్యార్థులు మహేశ్వర్‌రెడ్డికి టాటా టియాగో ఈవీ కారును అందజేశారు. కార్యక్రమానికి ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగాలన్నా గురువు ఉండాలని, ఉపాధ్యాయుడే తరగతి గది సైనికుడని అన్నారు. నిరంతరం విద్యార్థుల గురించి ఆలోచిస్తూ గొప్పగొప్ప ఆలోచనలు చేస్తూ వాళ్ల పురోగతికి కృషి చేస్తాడో ఆ ఉపాధ్యాయుడు విద్యార్థుల మనసుల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంటాడన్నారు. వేలాది మంది శిష్యప్రశిష్యులను సంపాదించుకున్న గొప్పగురువు మహేశ్వర్‌రెడ్డి అని కొనియాడారు. మహేశ్వర్ రెడ్డి సేవలను స్మరిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య ఆటవెలదులలో గురుమహేశ్వరం పేరుతో ఒక శతకాన్ని వెలువరించడం గొప్ప విషయమన్నారు. డైట్ ను చూస్తే నందనవనం గుర్తుకు వస్తుందని పిల్లల క్రమశిక్షణ నడవడిక తెలంగాణలోని అన్ని డైట్లకు ఆదర్శంగా ఉందని తెలంగాణలో ఉన్న పది డైట్లలో కరీంనగర్ డైట్ ప్రథమ స్థానంలో ఉందని, ఇది ఒక సంస్కార కేంద్రమని, వివిధ కళాప్రదర్శనల నిలయమని కొనియాడారు. కవి, అవధాని డాక్టర్ గండ్ర లక్ష్మణ్‌రావు మాట్లాడారు. డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ ప్రిన్సిపాల్ జయధీర్ రెడ్డి, నిజామాబాద్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వరంగల్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సంపత్ కుమార్ హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


