పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లు, కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా ఆయా శాఖలకు ఏటా రూ.లక్షల ఆదాయం అద్దెల రూపంలో సమకూరుతోంది. ఇందులో ఆర్టీసీ బస్టాండ్, వ్యవసాయ మార్కెట్, ప్రభుత్వ ఆస్పత్రి, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కూరగాయల మార్కెట్, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల ఎదుటి కాంప్లెక్స్‌లు అద్దెకు ఇచ్చారు. వీటిలోని కొన్నింటి నుంచి అద్దె వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఖాళీగా వ్యవసాయ మార్కెట్ కాంప్లెక్స్
వ్యవసాయ మార్కెట్ ఎదుటి షాపింగ్ కాంప్లెక్స్‌లో 13 గదులు ఖాళీగా ఉంటున్నాయి. ఒక్కోగదికి అద్దె రూ.15,462గా నిర్ణయించారు. తొలిసారి పోటీపడి అద్దెకు పొందిన వ్యాపారులెవరూ తమ వ్యాపారా లు ఇంకా ప్రారంభించలేదు. అద్దె అధికంగా ఉందని వారు చెబుతున్నారు.
కొనసాగిస్తారా.. కూల్చివేస్తారా?
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్‌ను అలాగే ఉంచుతారా..? లేదా కూల్చివేస్తారా? అనేదానిపై అద్దెదారుల్లో సందిగ్ధం నెలకొంది. కొత్త సముదాయం నిర్మించే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో జెండా కూడలిలో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పాత షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేసి ఆ స్థలం పార్కింగ్‌కు కేటాయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇలాగైతే తమ సంగతేమిటని వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.
కూలనున్న ప్రభుత్వాస్పత్రి కాంప్లెక్స్
జిల్లా ప్రభుత్వాస్పపత్రి షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేసి పార్కింగ్ కోసం కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే వ్యాపార సముదాయం ఎదుట ఇటీవల కందకం తవ్వించారు. వ్యాపారాలు సాగక చాలామంది గదులు ఖాళీ చేశా రు. ఖాళీచేయని వారి గదుల స్లాబులను రెండ్రోజుల క్రితం డ్రిల్‌మిషన్‌తో రంద్రాలు చేశారని, ఇది సరికాదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపైకి తహసీల్ ఆఫీస్ కాంప్లెక్స్
రైల్వేస్టేషన్ సమీపంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుటి ఆరు గదులతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకుల్లో కొందరు వ్యాపారాలను రోడ్డుపైకి తీకొచ్చారు. దీంతో రాకపోకలకు రైల్వే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు, చిరువ్యాపారులు నడిరోడ్డుపైకి రావడంతో రాకపోకలకు సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నారు. వీటితో కాంప్లెక్స్ గదులు ఎక్కడ ఉన్నాయో కనిపించకుండాపోతోంది. వాటిముందు తాత్కాలికం పేరిట పర్మినెంట్ నిర్మాణాలు చేపట్టారని, అద్దె చెల్లిస్తున్నారో.. లేదో కూడా తెలియ దంటున్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆక్రమణలు తొలగించి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
‘సీజ్’ తొలగేదెప్పుడో?
స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదుటి కాంప్లెక్స్‌లోని గదులు అద్దెకు పొందిన వారి లీజు గడువు ముగిసింది. అద్దెపెంచితే రెన్యూవల్ చేసుకునేందుకు ముందుకు రావడంలేదని, ఇప్పటికే అద్దెపొందిన కొందరు ఇతరులకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారని గుర్తించిన ఉన్నతాధికారులు.. గదులను ఖాళీ చేయాలని వ్యాపారులకు నోటీసులిచ్చారు. స్పందించక పోవడంతో గదులు సీజ్ చేశారు. బకాయిదారులు అద్దె చెల్లించినట్టు సమాచారం. తాజాగా టెండర్ నిర్వహించాలని నిర్ణయించి ఇంటర్‌బోర్డు అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. త్వరలోనే వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


