గణేశునికి పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

గణేశునికి పటిష్ట భద్రత

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

ఈసారి డీజేకు నోచాన్స్‌ రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

గోదావరిఖని: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో సాగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు. వేడుకలు శాంతియుతంగా జరిగేలా సహకరించాలని మండప నిర్వాహకులతో ఇప్పటికే సమీక్షించి పలు సూచనలు చేశామని వివరించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..

ఏమైనా ఆంక్షలు ఉన్నాయా?

సీపీ: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విధించిన ఆంక్షలు ఈనెల 14 నుంచి 25వ తేదీ వరకు అమలులో ఉంటాయి.

నిబంధనలు అతిక్రమిస్తే..?

సీపీ: నిబంధనలు అతిక్రమిస్తే బైండోవర్‌ చేస్తాం. జరిమానా విధిస్తాం. అవసరమైతే క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తాం.

అత్యవసర సేవల కోసం ఎవరిని సంప్రదించాలి?

సీపీ: పోలీస్‌స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌వోను సంప్రదించాలి. ఫిర్యాదు కోసం డయల్‌ 112 నంబర్‌కు ఫోన్‌చేయాలి. కంట్రోల్‌ రూం నంబర్‌ 87126 56597ను ఎప్పుడైనా సంప్రదించే వీలుంది.

డీజేల వినియోగంపై మీ స్పందన?

సీపీ: అత్యధిక డెసిబుల్స్‌ వెలువరించే డీజేలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్థులపై ఆ శబ్దం తీవ్రప్రభావం చూపుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు డీజే నిర్వాహకులతో ఇప్పటికే సమావేశమయ్యాం. నిబంధనలు అతిక్రమించిన వారిని బైండోవర్‌ చేశాం.

నవరాత్రి ఉత్సవాలకు నిఘా ఎలా ఉంది?

సీపీ: కమిషనరేట్‌లో పీసీఆర్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం. ఫోన్‌కాల్స్‌ ఆధారంగా పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం.

ఈసారి ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారు?

సీపీ: ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటివరకు 4,321 దరఖాస్తులు వచ్చాయి. 3,206 విగ్రహాలకు అనుమతి ఇచ్చాం. 383 విగ్రహాల అనుమతి ఇవ్వాల్సి ఉంది. 32 దరఖాస్తులు తిరస్కరించాం. ఈసంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మండపాలపై ఎవరి నిఘా ఉందా?

సీపీ: నిరంతర పర్యవేక్షణ కోసం బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్స్‌, విజిబుల్‌ పోలీసింగ్‌ కొనసాగుతుంది. ప్రతీవిగ్రహం వద్ద పాయింట్‌ బుక్‌ ఏర్పాటు చేస్తాం.

భక్తులను పక్కతోవ పట్టిస్తే..?

సీపీ: కమిషనరేట్‌ పరిధిలో సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ ఉంది. భక్తులను తప్పుదోవ పట్టేలా పోస్ట్‌చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోం.

ప్రత్యేక ఫోర్స్‌ను నియమించారా?

సీపీ: ఏఆర్‌, స్పెషల్‌ పార్టీ ఫోర్స్‌ వినియోగిస్తాం. అవసరమైతే మరింత ఫోర్స్‌ను తెప్పించేలా ప్రణాళిక రూపొందించాం.

సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయా?

సీపీ: గతేడాది నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఆ అనుభవాలతో అధికారులను సమన్వయం చేసి ఈసారి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాం.

సున్నిత ప్రాంతాలపై ఎలా వ్యవహరిస్తారు?

సీపీ: సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలో జరిగే ఘటనలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఈఏడాది సీసీటీవీలు, కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసి, అదనపు సిబ్బందితో ప్రత్యేక పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement