పీవోపీ విగ్రహాల వైపే జిల్లావాసుల మొగ్గు పర్యావరణ హిత మట్టి గణపతిపై ప్రచారలేమి కాలుష్య నియంత్రణ మండలి చొరవ అంతంతే పర్యావరణ పరిరక్షణ పట్టని పురపాలికలు
మట్టి గణపతి..
సాక్షి పెద్దపల్లి: వినాయక చవితి అంటే భక్తి.. సంప్రదాయం.. పర్యావరణ పరిరక్షణను చాటిచెప్పే పండుగ. కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీవోపీ), రసాయనిక రంగులతో తయారు చేసిన విగ్రహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి జలవనరులను కలుషితం చేస్తున్నాయి. ప్రకృతిని కాపాడేందుకు మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాలని పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం ఆశించినస్థాయిలో ముందస్తు కార్యాచరణ రూపొందించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
● భారీ విగ్రహాలతో మరింత ముప్పు
ప్రజల్లో కొంతవరకు కలిగిన చైతన్యంతో ఇళ్లలో 90శాతం మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటున్నారు. పీసీబీ, స్వచ్ఛద సంస్థలు వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. సమస్యంతా.. పీవోపీ, రసాయనిక రంగులతో తయారు చేసిన భారీ విగ్రహాలతోనే. పీవోపీ నీటిలో సులభంగా కరగదు. కుంటలు, చెరువులు, నదులు, ఇతర జలవనరుల్లో వ్యర్థాలు పేరుకుపోయి జలచరాలకు హాని కలిగిస్తున్నాయి.
● భాగస్వామ్యం తక్కువే
పెద్దపల్లి, రామగుండం, మంథని, సుల్తానాబాద్‌తోపాటు గ్రామాల్లోనూ ఏటా పెద్దసంఖ్యలో వినాయక విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. అయితే, మట్టి విగ్రహాలనే వినియోగించడంలో మండప నిర్వాహకులు, యువజన సంఘాలు, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.
● మున్సిపాలిటీలదీ బాధ్యతే
రామగుండం నగరంతోపాటు పెద్దపల్లి, మంథని పట్టణాల్లో గణపతి మండపాల సంఖ్య భారీగా ఉంటుంది. భారీ విగ్రహాలతో నిమజ్జనం సందర్భంగా వ్యర్థాలు వెలువడుతాయి. అయితే, పీఓపీ విగ్రహాలతో కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పురపాలక అధికారులపైనా ఉంది. మట్టి విగ్రహాలను తయారు చేసే కళాకారులను ప్రోత్సహించడం, స్థానికంగా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయించడం, మండప నిర్వాహకులకు తక్కువ ధరకు మట్టి విగ్రహాలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ప్రచారానికే పరిమితమా?
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగానే మట్టి ప్రతిమలు వినియోగించాలని అధికారులు ప్రచారం చేయడం సాధారణంగానే మారింది. వేడుకలకు కొద్ది రోజుల ముందు హడావుడిగా కార్యక్రమాలు నిర్వహించడం కన్నా.. కొన్ని నెలల ముందే ప్రత్యేక ప్రణాళికతో ప్రచారం చేస్తే సత్ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని నియంత్రణ మండలి సుమారు వెయ్యి మట్టివినాయక విగ్రహాలను కలెక్టరేట్‌తోపాటు పెద్దపల్లి, గోదావరిఖని బస్టాండ్‌ల వద్ద ఉచితంగా పంపిణీ చేసినా.. ఏటా అత్యధిక సంఖ్యలో అందజేయాలనే డిమాండ్ వస్తోంది.


