పెద్దపల్లిరూరల్: ప్రతీపల్లె సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడంతోపాటు వచ్చే ఐదేళ్లలో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీతెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ది ప్రణాళికశ్రీ పేరిట వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 30 పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. మనజిల్లా నుంచి ఎలిగేడు మండలం నారాయణపూర్‌ను పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశారు. వెబ్‌సైట్‌లో వివరాల నమోదు తదితర అంశాలపై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఎంపిక చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.
పీఏఐ ఇండెక్స్‌లో వివరాలు
పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ (పీఏఐ)లో పంచాయతీ లాగిన్‌లో ప్రతీ గ్రామ పంచాయతీ ప్రొఫైల్‌తోపాటు సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తారు. ప్రతీ పంచాయతీ జనాభా, ఓటర్ల సంఖ్యతోపాటు ప్రభుత్వ శాఖల వారీగా వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వివరాల నమోదు ప్రక్రియ జిల్లాలో పూర్తయ్యే దశలో ఉంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎలిగేడు మండలం నారాయణపూర్ పంచాయతీ వివరాలను ఆన్‌లైన్ నమోదు చేశారు. ప్రభుత్వ శాఖల వారీగా 17శాఖల పూర్తి వివరాలను అప్‌లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు.
మూడు విభాగాల వారీగా...
ప్రతీ పంచాయతీ సమగ్ర సమాచారాన్ని మూడు భాగాలుగా ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. పార్ట్–1లో ప్రతీ పంచాయతీ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేయాలి. జనాభాతోపాటు అందుబాటులోని వనరులు, ప్రభుత్వ శాఖల వారీగా అందుతున్న సేవలు తదితర అంశాల సమాచారం ఉంటుంది. పార్ట్–2లో రాబోయే 3 నుంచి ఐదేళ్లలో చేపట్టాల్సిన ప్రణాళికలను పాలకులు, ప్రజలతో చర్చించి ఆ వివరాలను నమోదు చేస్తారు. పార్ట్–3లో ప్రస్తుత ఆదాయ, వ్యయాలతోపాటు బడ్జెట్, ఖాతా వివరాలను పొందుపరుస్తారు.
పారదర్శకత కోసమే..
పంచాయతీ పాలన పారదర్శకంగా ఉండేలా చూసేందుకే ప్రతీపంచాయతీ వివరాలను ప్రజలందరూ చూసేలా ప్రత్యేకంగా రూపొందించే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకే ప్రభుత్వం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ పాలకులు చేపట్టే ప్రతీపని, ప్రతిపైసా ఖర్చు వివరాలు ఈవెబ్‌సైట్‌లో కనిపిస్తాయి.
వివరాలు నమోదు చేస్తున్నాం
ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో ప్రతీ పంచాయతీ వివరాలు నమోదు చేస్తున్నాం. ఇప్పటికే చాలా పంచాయతీల్లో ప్రక్రియ చివరిదశకు చేరింది. త్వరలోనే వెబ్‌సైట్ అందుబాటులోకి రానుంది. దీనిపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సుందిల్ల, నాగెపల్లి, బొట్లవనపర్తి సర్పంచులతో కలిసి హాజరయ్యా. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించి పొరపాట్లు లేకుండా నమోదు చేసేలా చూస్తాం.
– శ్రీమాల, ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి


