సింగరేణి సంక్షేమ శాఖలో పదోన్నతి గందరళగోళం
సమానంగా చూడాలంటున్న ఇంటర్నల్ అధికారులు
గ్రేడ్ ప్రకారం ముందుకెళ్లాలంటున్న ఎక్స్‌టర్నల్ అధికారులు
కోలిండియా ప్రకారం ముందుకెళ్లాలంటున్న సీఎంవోఏఐ
గోదావరిఖని: సింగరేణి సంక్షేమ శాఖలో ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్‌టర్నల్ పోరుసాగుతోంది. గతంతో సంబంధం లేకుండా తమకు పదోన్నతి కల్పించాలని నేరుగా పరీక్షరాసి పాసైన(ఎక్స్‌టర్నల్) అధికారు లు కోరుతుంటే, కోలిండియాలోని నిబంధనల ప్ర కారం అందరికీ సమాన గ్రేడ్ ఇవ్వాలని పదోన్నతి పొందిన(ఇంటర్నల్) అధికారులు అంటున్నారు. దీనిపై కోర్టుకు సైతం వెళ్లినట్లు తెలుస్తోంది.
● గ్రేడింగ్ విధానంలో విభేదాలు
ఉద్యోగుల సంక్షేమంలో కీలకమైన వెల్ఫేర్ విభాగంలో గ్రేడింగ్ వివాదం అధికారుల మధ్య విభేదాలకు దారితీసింది. ఒకేవిధమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారుల్లో కొందరికి ఈ–1 గ్రేడ్, మరికొందరికి ఈ–2 గ్రేడ్ ఇవ్వడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. చివరకు ఈ వ్యవహారం న్యాయస్థానం వరకూ వెళ్లగా.. తెలంగాణ హైకోర్టు సైతం ఇంటర్నల్‌గా నియమితులైన అధికారుల వాదనను పరిశీలించి సింగరేణి తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నించింది!
● అసలు వివాదం ఇదే..
వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక ప్రక్రియలో ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అభ్యర్థులు అనే రెండు విధానాలు ఉన్నాయి. 2013లో 8మంది, 2015లో 10మంది ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్ ద్వారా వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీలుగా ఎంపికయ్యారు. కొందరికి తొలుత ఈ–1 గ్రేడ్ కేటాయించారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారు ఈ–2కి వెళ్లారు. అదే సమయంలో ఎక్స్‌టర్నల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 40మంది జాయిన్ అయ్యారు. మేనేజ్‌మెంట్ ట్రైనీలకు ప్రారంభంలోనే ఈ–2 గ్రేడ్ లభించింది. దీంతో ఒకేవిభాగంలో పనిచేస్తున్న అధికారుల మధ్య గ్రేడ్, సీనియారిటీ, తదుపరి ప్రమోషన్ విషయంలో అసమానత ఏర్పడింది. అదే 2015–2016 ఇంటర్నల్ బ్యాచ్ అధికారుల పదోన్నతి సజావుగా సాగుతోంది.
● మేమే ముందుగా వచ్చాం..
ఇంటర్నల్ అధికారుల ప్రధాన అభ్యంతరం ఇదే. తాము ముందుగానే సంస్థలో నియమితులై విధులు నిర్వహిస్తున్నా.. ఎక్స్‌టర్నల్ నియామకం ద్వారా తర్వాత వచ్చిన కొందరు అధికారులు ఈ–2లోకి రావడంతో గ్రేడ్‌లోనే కాదు సీనియారిటీ, తదుపరి ఈ–3 ప్రమోషన్‌లోనూ తాము వెనుకబడాల్సి వస్తోందంటున్నారు. 2013 మే 11న జారీ చేసిన సర్క్యులర్‌లో వెల్ఫేర్ ఆఫీసర్ల గ్రేడింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని తమ విషయంలో అమలు చేయలేదని ఇంటర్నల్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇదే సర్క్యులర్ ప్రకారం ఈఅండ్‌అండ్, సివిల్, మైనింగ్ అధికారుల పదోన్నతులు కొనసాగుతున్నాయి.
● యాజమాన్యం వాదన.. అధికారుల అభ్యంతరం
ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ నియామకాల అర్హతలు, వయసు, ఎంపిక విధానం వేర్వేరుగా ఉన్నాయని సింగరేణి వాదించింది. ఇంటర్నల్ అభ్యర్థులు ఈ–1 గ్రేడ్ ఉద్యోగ నిబంధనలను అంగీకరించే ఉద్యోగంలో చేరారని పేర్కొంది. కానీ ఇంటర్నల్ అధికారులు ఒకేసంస్థలో ఒకేవిధమైన విధులు నిర్వహిస్తున్నా గ్రేడింగ్‌లో ఇంత వ్యత్యాసం ఎందుకు? అని ప్రశ్నించారు.
● కోర్టు వరకు వెళ్లిన ‘గ్రేడ్ వార్’
వివాదం చివరకు తెలంగాణ హైకోర్టు గడప తొ క్కింది. 2025 డిసెంబర్ 5న వెలువడిన తీర్పులో కోర్టు 2015లో ఇంటర్నల్‌గా ఈ–1లో నియమితులైన అధికారుల పరిస్థితిని, తర్వాత ఈ–2లో నియ మితులైన అధికారుల సీనియారిటీని, 2013 నాటి సర్క్యులర్ అమలును పరిశీలించింది. ఇంటర్నల్ అధికారులను ఒకవిధంగా, తర్వాత వచ్చిన అధికారులను మరో విధంగా పరిగణించడంతో ఏర్పడిన పరిస్థితిని కోర్టు ఏకపక్షంగా వదిలిపెట్టలేదు. యాజ మాన్యం జారీచేసిన తిరస్కరణ ఉత్తర్వులు 2013 నాటి మార్గదర్శకాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని నిబంధనల ప్రకారం పునఃపరిశీలించాలని ఆదేశించింది.
కోలిండియా మాదిరిగానే..
కోలిండియాలో అమలవుతున్న విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయడం సమంజసం. కోలిండియాలో అమలవుతున్న తీరును ఇప్పటికే అధ్యయనం చేశాం. త్వరలో ఈవిషయంపై యాజమాన్యం–అధికారుల సంఘం మధ్య జరిగే స్ట్రక్చరల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
– తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్,
అధ్యక్షుడు, సీఎంవోఏఐ
తీర్పుతో బయటపడిన అసలు సమస్య
ఈ వివాదం కేవలం ఈ–1, ఈ–2 గ్రేడ్ల మధ్య వ్యత్యాసమే కాదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక గ్రేడ్ తేడా భవిష్యత్‌లో సీనియారిటీ, ప్రమోషన్, కెరీర్ ప్రొగ్రెషన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటమే అసలు సమస్య. అందుకే ఇంటర్నల్–ఎక్స్టర్నల్ అనే విభజనకు బదులుగా, నియామక నిబంధనలు, సీనియారిటీ, గ్రేడింగ్ విధానాన్ని ఒకే ప్రమాణంతో స్పష్టంగా అమలు చేయాలన్న డిమాండ్ బలపడుతోంది.


