పేర్లు ఎలా మారాయంటే..?
మారుపేర్ల సమస్య పరిష్కారానికి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప్రకటన
విశ్రాంత సింగరేణి కార్మికుల్లోనూ చిగురించిన ఆశలు
ఆధార్ కార్డులు, ఆస్తుల మార్పులు జఠిలం
మారుపేర్లతో నిలిచిపోయిన పలువురి పింఛన్లు
తమకూ న్యాయం చేయాలని సీఎంకు వేడుకోలు
అందరికీ న్యాయం చేయాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
సింగరేణి మారుపేర్లపై తొలిసారిగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడం కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపింది. సంస్థలో రెండుపేర్లతో పనిచేస్తున్న కార్మికులను ఇప్పటికే తాము గుర్తించామని, దీనిపై కమిటీ వేశామని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడాన్ని సింగరేణి వ్యాప్తంగా కార్మికలోకం స్వాగతిస్తోంది. అదే సమయంలో తమ సమస్యలను కూడా పరి ష్కరించాలని విశ్రాంత కార్మికులు వేడుకుంటున్నా రు. అదే రెండుపేర్ల సమస్య తమనూ నేటికీ వెంటా డుతోందని, కనీసం తాము మరణించేలోగానైనా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వంతో విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో అనేక ఇబ్బందులు పడుతున్నతా ము.. ఆస్తుల మార్పిడి, ఆధార్‌కార్డులు, ఇతర గు ర్తింపు కార్డుల విషయంలో చెప్పలేని పాట్లు, మానసిక వ్యధ అనుభవిస్తున్నామని వాపోతున్నారు.
ఆస్తులు, పింఛన్ల విషయంలో..
ఇప్పటివరకూ రిటైర్డ్ అయిన వారిలో 35వేల మందికిపైగా విశ్రాంత కార్మికులు రెండుపేర్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరంతా 70 నుంచి 80ఏళ్లు పైబడిన వారే. వీరిలో సగానికిపైగా రెండు ఆధార్‌కార్డులు తీసుకున్నారు. ఇదే వీరికి శాపంగా పరిణమించింది. ప్రస్తుతం బ్యాంకులు కేవైసీలు అడుగుతున్న క్రమంలో ఆధార్‌కార్డులు మ్యాచ్ కాక సగానికిపైగా కార్మికుల పింఛన్లు నిలిచిపోయాయి. ఇప్పటికీ వీరి ఆస్తులు వారి సంతానం పేరిట మారకపోవడంతో తల పట్టుకుంటున్నారు. తాజాగా కాస్తోకూస్తో వస్తున్న పింఛన్లు కూడా నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా అలియాస్ పేరుతో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నారు.
ఉత్తర తెలంగాణలోని గోదావరిలోయ వెంట విస్తరించిన సింగరేణి గనుల్లో ఉద్యోగానికి ఐదు దశాబ్దాల కింద ఎవరూ ముందుకు రాలేదు. ధైర్యం చేసి ముందుకు వచ్చిన వారికి సరైన గుర్తింపు కార్డుల్లేవు. దీంతో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లో పేరు నమోదైన తమకు తెలిసిన వారి కార్డులతో కొలువుల్లో చేరారు. అలా వారి పేర్లు.. ఇంటిపేర్లు మారిపోయాయి. అధికారుల తప్పిదాలతో కొందరి కార్మికుల ఇంటిపేర్లలో తప్పులు దొర్లాయి. 1990 దశకంలో 1.2 లక్షలుగా ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్య నేడు 40,225కి పడిపోయింది. అంటే దాదాపు 80 వేల మంది కార్మికులు ఉద్యోగ విరమణ పొందారు. అధికారవర్గాల సమాచారం మేరకు దాదాపు 35వేల మందికిపైగా కార్మికులు ఇలా మారుపేర్లతో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. ఇదే విషయంపై రెండుదశాబ్దాల కింద పలువురు కార్మికులపై కోర్టు కేసులు కావడంతో సింగరేణి యాజమాన్యం గెజిట్ తెచ్చుకున్న కార్మికులకు చట్టబద్ధంగా గుర్తింపునిస్తామని 2009లో రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) వద్ద అధికారికంగా అంగీకరించింది. ఈ విషయమై మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి కూడా రెండు పేర్లున్న కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినా అవి ఆచరణకు నోచుకోలేదు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఎన్నికల సమయంలో ప్రకటించారు. ప్రస్తుతం ఏడుగురి బృందంతో కమిటీ వేశారు. ఇప్పటి వరకూ కమిటీ సమావేశం కాలేదు. వందలాదిమంది మెడికల్ అన్‌ఫిట్ కార్మికులు వారి పిల్లలకు వారసత్వ జాబ్‌లకోసం ఎదురుచూస్తున్నారు. విశ్రాంత కార్మికుల్లో పలువురు ఆస్తులు వారసులకు మారడం లేదు. బ్యాంకుల్లో కేవైసీ సమస్యతో పింఛన్లు ఆగిపోయాయి. నెల లేదా రెండు నెలలోపు అన్నీ పరిష్కారం చేసి అందరికీ అవకాశం ఇచ్చి సరిచేస్తే.. విశ్రాంత, వర్కింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. – వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షులు


