రామగుండం కమిషనరేట్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రామగుండం కమిషనరేట్‌ ప్రతిభ

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

గోదావరిఖని(రామగుండం): రాష్ట్ర స్థాయిలో క్రైమ్‌ పారామీటర్ల అమలులో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ ఉత్తమ ప్రతిభ కనబరిచి ముందంజలో నిలిచింది. రాష్ట్రంలోని పలు పోలీస్‌ యూనిట్ల పనితీరును సమీక్షించిన ఉన్నతాధికారులు, అత్యుత్తమ పనితీరు కనబరిచిన యూనిట్లను గుర్తించారు. ఈక్రమంలో క్లస్టర్‌–1లో హైదరాబాద్‌, క్లస్టర్‌–2లో రామగుండం, క్లస్టర్‌–3లో నల్గొండ, క్లస్టర్‌–4లో సూర్యాపేట పోలీస్‌ యూనిట్లు మొదటి స్థానాల్లో నిలిచాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్‌కు శనివారం డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి, అత్యుత్త్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

గడువులోగా పూర్తి చేయండి

జూలపల్లి(పెద్దపల్లి): సర్‌ ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో ఓటర్ల నమోదులో తప్పులను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు ఆదేశించారు. శనివారం మండలంలోని వెంకట్రావుపల్లెలో సర్‌ నమోదును తనిఖీ చేశారు. ఈసందర్భంగా అబ్బాపూర్‌లో నిర్వహిస్తున్న సర్‌ నోటీసుల వివరాలను తహసీల్దార్‌ ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి, అవసరమైన రుజువు పత్రాలను తీసుకోవాలని సూచించారు. సీనియర్‌ అసిస్టెంట్‌ త్రివేణి, ఆర్‌ఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.

డైరెక్టర్‌తో ఎమ్మెల్యే

సంభాషణ బయటపెట్టాలి

గోదావరిఖని(రామగుండం): క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో సింగరేణి డైరెక్టర్‌ జరిపిన సంభాషణ బయట పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. క్యాంపు కార్యాలయంలో ఎందుకు రివ్యూ నిర్వహించారో డైరెక్టర్‌ సూర్యనారాయణ సమాధానం చెప్పాలన్నారు. సింగరేణి యాజమాన్యం వెంటనే డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలన్నారు. దీనిపై సీఎండీ ప్రకటన చేయాలన్నారు. సింగరేణి స్థలాల్లో ఇళ్ల నిర్మాణం జరిగితే సంస్థ ఫొటో పెట్టుకోవాలే కాని, కాంగ్రెస్‌ నాయకుల ఫొటోలు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వచ్చే నెల 2న నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రజలు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు కౌశికహరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, మురళీధర్‌రావు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

మధురైకి ప్రత్యేక రైళ్లు

రామగుండం: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ సెంట్రల్‌ నుంచి తమి ళనాడులోని మధురై మధ్య సెప్టెంబర్‌ 2 నుంచి 28 వరకు రెండు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కా న్పూర్‌ సెంట్రల్‌–మధురై (రైలు నం.01925) సెప్టెంబర్‌ 2నుంచి ప్రతీ బుధవారం కాన్పూర్‌లో ఉదయం 8.10 గంటలకు బయలుదేరనుంది. మధురై–కాన్పూర్‌ సెంట్రల్‌ (రైలు నం.01926) సెప్టెంబర్‌ 5 శనివారం వేకువజామున 2.30 గంటలకు మధురై నుంచి బయలుదేరనుంది. ఈ రైలుకు సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌, రామగుండం, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూర్‌, రేణిగుంట రైల్వేస్టేషన్లలో హాల్టింగ్‌ కల్పించా రు. కాగా మధుర మీనాక్షి, రామేశ్వరం, తిరుపతి వెళ్లు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దీనికి సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ ఎకానమీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement