ప్రభుత్వ భూములకు ఇంటి నంబర్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూములకు ఇంటి నంబర్లు

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

ధర్మారం(ధర్మపురి): ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలో ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించి వాటి ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు పొందుతూ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి వ్యవహారంలో ఇప్పటికే ధర్మారం గ్రామపంచాయతీ కార్యదర్శిని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. కాగా పంచాయతీ పరిధిలోని ఆబాది, ప్రభుత్వ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంటి నంబర్లు సృష్టించి పంచాయతీ నుంచి పత్రాలు పొందుతున్నారనే సమాచారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ధర్మారం మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలోని ప్రభుత్వ భూమి 476లో 15 ఏళ్ల క్రితం ఇద్దరు వ్యక్తులకు రెవెన్యూ అధికారులు నివాస స్థలం కేటాయిస్తూ పట్టాలు జారీ చేశారు. సదరు వ్యక్తులు ఇంటి నిర్మాణాలకు ప్రయత్నించగా వివాదాస్పదం కావడంతో అప్పటి నుంచి ఆ స్థలం ఖాళీగానే ఉంది. కాగా, ఈ ఏడాది జనవరి 7న పెద్దపల్లి మండలానికి చెందిన ఒ వ్యక్తి పేరుతో అదే స్థలానికి ఇంటి నంబర్‌ ఆధారంగా సుల్తానాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు పత్రాలు బయటకు వచ్చాయి. వివాదాస్పద స్థలాన్నే రిజిస్ట్రేషన్‌ చేయించారంటే, ఇంకా మరెన్ని స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మధ్యవర్తులుగా యువకులు..?

ధర్మారం గ్రామపంచాయతీకి చెందిన ఒ వార్డు సభ్యుడితో పాటు వెల్గటూర్‌, ఎండపల్లి మండలాలకు చెందిన మరో ఇద్దరుముగ్గురు యువకులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించటం, పంచాయతీ నుంచి ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి రిజిస్ట్రేషన్లు చేయించడం వంటి వ్యవహారాల్లో వీరి పాత్ర ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. సామాన్యుల వ్యక్తిగత అవసరాలను ఆసరాగా చేసుకుని, వారి నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని ఖాళీ స్థలాలకు అక్రమంగా పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ భూములుగా పేర్కొంటున్న 375స, 476 సర్వే నంబర్లలోని ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు సమాచారం.

రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఒరిజినలా.. నకిలీవా..?

వెలుగులోకి వచ్చిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు సుల్తానా బాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పేరుతో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు జరిగాయా.. లేదా నకిలీ స్టాంపులు, సంతకాలతో పత్రాలు సృష్టించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత జిల్లా అధి కారులు పంచాయతీ రికార్డులు, ఇంటి నంబర్ల కే టాయింపు వివరాలు, ధ్రువీకరణ పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వ చ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

ఖాళీ స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు

ధర్మారం గ్రామపంచాయతీలో వెలుగులోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement