పనిస్థలాల్లో అత్యుత్తమ రక్షణ చర్యలు వేగవంతంగా నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు.. కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి జాతీయ స్థాయిలో మెరిసిన ఐదు బొగ్గు గనులు హ్యాట్రిక్ సాధించిన ఓసీపీ–1
గోదావరిఖని: సింగరేణిలోని ఐదు బొగ్గు గనులు ఫైవ్‌స్టార్ రేటింగ్‌లో నిలిచి జాతీయస్థాయిలో సత్తాచాటాయి. దేశంలోని 382 గనుల దరఖాస్తు చేసుకున్నాయి. రక్షణ, ఉత్పత్తి, పర్యావరణం, పనివిధానం, ప్రభావిత గ్రామాల అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ లాంటి ఏడు అంశాల్లో సింగరేణిలోని ఐదు బొగ్గు గనులు అత్యుత్త ప్రతిభ కనబర్చడంతో ఫైవ్‌స్టార్ రేటింగ్ లభించింది. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఏటా దేశవ్యాప్త బొగ్గు గనుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏడు ప్రధాన విభాగాల్లోని 50 అంశాల్లో వందకు 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వాటిని ఫైవ్‌స్టార్ (అ త్యుత్తమ) గనులుగా గుర్తించారు. దేశవ్యాప్తంగా 50 గనులు ఫైస్టార్ రేటింగ్‌లో నిలిచాయి.
సింగరేణిలోని ఉత్తమ గనులు ఇవే..
సింగరేణిలోని ఐదు బొగ్గు గనులు ఫైస్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే–6, సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీ–2, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసీపీ, రామగుండం ఏరియా–3లోని ఓసీపీ–1 అత్యుత్తమ 5 స్టార్ రేటింగ్ గనులుగా నిలిచాయి. గతేడాది 4 గనులకు 5స్టార్ రేటింగ్ రాగా ఈ సారి 2024 –2025 సంవత్సరానికి గాను సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 5గనులు 5స్టార్ రేటింగ్ సాధించి సత్తాచాటడం విశేషం.
ఫోర్‌స్టార్ రేటింగ్‌లో మరో 17 గనులు
5 స్టార్ కన్నా కొంచెం తక్కువ మార్కులు (80–90 శాతం) సాధించిన గనులను ఫోర్‌స్టార్ రేటింగ్‌కు ఎంపిక చేస్తారు. ఇందులో సింగరేణిలోని 17 బొగ్గు గనులు కూడా ఫోర్‌స్టార్ రేటింగ్‌కు ఎంపికయ్యాయని అధికారులు వెల్లడించారు.
అధికారులు, కార్మికుల పాత్ర కీలకం..
ఫైవ్‌స్టార్ రేటింగ్ నిరంతర ప్రక్రియగా కొనసాగితే తప్ప అవార్డు సాధించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి మొదలు అవార్డు ప్రకటించే వరకూ ప్రతీ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి. నిరంతరం శ్రమించాలంటున్నారు అవార్డుకు ఎంపికైన రామగుండం రీజియన్‌లోని ఓసీపీవన్ అధికారులు.
ఓసీపీ–1 హ్యాట్రిక్
ఫైవ్‌స్టార్ రేటింగ్‌లో సింగరేణిలోని రామగుండం రీజియన్‌లో గల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు – వన్ మూడోసారి ఎంపికై హ్యాట్రిక్ సాధించింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా ఫైవ్‌స్టార్ రేటింగ్‌లో ప్రతిభ చూపుతూ వస్తోంది.
ప్రయోజనాలు ఇవీ..
ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో సంస్థ పేరు, ప్రతిష్టలు కోలిండియా స్థాయిలో పెరుగుతాయి. అవార్డుతో ప్రత్యక్షంగా ప్రయోజనం పెద్దగా ఉండకున్నా.. కొత్త గనుల తవ్వకాలకు అనుమతి విషయంలో చాలా ఉపయోగపడనుంది. కేంద్ర అటవీ పర్యావరణ, డీజీఎంఎస్ అనుమతులు త్వరగా లభించే అవకాశాలున్నాయి.


