పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారు. ఇందుకు అవసరమైన మందులు, యంత్ర పరికరాలూ అందుబాటులో ఉంటున్నాయి. క్లిష్టమైన ఆపరేషన్లను సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ వ్యాధులతో బాధపడే పేద, మధ్యతరగతి ప్రజలు సర్కారు దవాఖానానే ఆశ్రయిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది అంకితభావంతోపాటు వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండడం సేవలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతోంది.
ఒక్కనెలలోనే 22,436 మందికి సేవలు
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేషెంట్లు వైద్యసేవల కోసం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రినే ఆశ్రయిస్తున్నారు. వీరికి అవసరమైన వైద్యసేవలూ అందుబాటులో ఉండడంతో రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఇందుకు నిదర్శనమే గత ఫిబ్రవరిలో మొత్తం 22,436 మంది అవుట్ పేషెంట్లు వైద్య సేవలు పొందడం గమనార్హం. ఇందులో 9,758 మంది జనరల్ మెడిసిన్, 4,923 మంది జనరల్ సర్జరీ, 3,364 మంది చిన్నపిల్లలు, 410 మంది గైనిక్, 1,509 మంది ఆర్థో, 675 మంది నేత్ర, 1,039 మంది ఈఎన్‌టీ, 574 మంది చర్మ, 369మంది దంత సంబంధిత సమస్యలకు సేవలు పొందారు. అదేవిధంగా ఆస్పత్రిలో మొత్తం 184 డెలివరీలు జరిగాయి.
ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న ఓపీ సేవలు
గత ఫిబ్రవరిలో ఏకంగా 22 వేల మందికి వైద్యం
సర్కారు దవాఖానాపై పేదల మమకారం
టెస్ట్‌ల్లోనూ ప్రతిభ
వ్యాధి నిర్ధారణ కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో గతనెలలో 27,859 టెస్టులు చేశారు. అదేవిధంగా 2,062 అల్ట్రాసౌండ్ స్కానింగ్, 133 టిఫా స్కానింగ్, 722 ఈసీజీ, 255 వరకు 2డీ ఇకో, 1,880 ఎక్స్‌రేలు, 724 ఫిజియోథెరపీలు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు దాదాపు 700 మంది నవజాత శిశువులు చికిత్స పొందారు. 8 లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు, ఒక యూరాలజీ శస్త్రచికిత్స, 9 రూట్ కెనాల్ శస్త్రచికిత్సలు చేశారు.


