బోధన్ రైలుకు బోర్డేది..!
రామగుండం: రైలు నంబర్ 67771 సిర్‌పూర్‌టౌన్–కరీంనగర్ వెళ్లే మెమూ ప్యాసింజర్ రైలు కొద్ది క్షణాల్లో రెండో నంబర్ ప్లాట్‌ఫారంపై రానున్నదంటూ.. రామగుండం రైల్వే స్టేషన్‌లో ఉదయం 11.05 గంటలకు రానున్న సమయంలో ముందస్తుగా రైల్వే అనౌన్స్‌మెంట్ చేయనున్నారు. కానీ మెమూ(మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలు మాత్రం బోధన్ వరకు వెళ్లనుందనే విషయం అసలు ప్రయాణికులకు తెలియకపోవడం గమనార్హం. రైలు నం.67771 సిర్‌పూర్‌టౌన్–కరీంనగర్, రైలు నం.67773 కరీంనగర్–బోధన్ వరకు రెండు నంబర్లతో రైలు నడుస్తుంది. అదే రైలు తిరుగు ప్రయాణంలో రైలు నం.67774 బోధన్–కరీంనగర్, రైలు నం.67772 కరీంనగర్ నుంచి సిర్‌పూర్‌టౌన్ వరకు. కాగా రైల్వే యాప్‌లో సిర్‌పూర్‌టౌన్ నుంచి బోధన్ వరకు రైళ్లను పరిశీలిస్తే స్పష్టమైన సమాచారం రాకపోవడం గమనార్హం.
నంబర్‌తో పని లేకుండా..
రైలు నంబర్‌తో పని లేకుండా నేరుగా సదరు రైలు గమ్యస్థానానికి వెళ్లే ప్రాంతాన్ని అనౌన్స్‌మెంట్ చేయడంతో కొత్తగా వెళ్లే ప్రయాణికులకు అర్థమవుతుంది. ఒకవేళ కరీంనగర్ వరకు వెళ్లే రైలు నంబర్‌తో అనౌన్స్‌మెంట్ చేసినా.. గమ్యస్థానాన్ని సైతం అనౌన్స్ చేస్తే ప్రయాణికుల నుంచి విశేష స్పందన ఉంటుంది.
సమయం ఆదా..
సిర్‌పూర్‌టౌన్ నుంచి నేరుగా బోధన్‌కు వెళ్లే ప్రయాణికులు అతి తక్కువ చార్జీలతో.. తక్కువ సమయంలో.. సుఖమయమైన ప్రయాణం చేసే అవకాశమున్నా.. రైల్వే శాఖ వైఫల్యంతోనే ప్రయాణికుల నుంచి ఆదరణ కరువైంది. కరీంనగర్ వరకు ఒక నంబర్, అక్కడి నుంచి బోధన్‌కు మరో రైలు నంబర్ ఉండడంతో.. సమాచారంపై అస్పష్టతతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు.
చార్జీలు అతి స్వల్పం
సిర్‌పూర్‌టౌన్(కొమురంభీం జిల్లా) నుంచి బోధన్(నిజామాబాద్ జిల్లా) వరకు మెమూ ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగిస్తోంది. సిర్‌పూర్‌టౌన్–కరీంనగర్ వరకు 143 కిలోమీటర్లు. కరీంనగర్ నుంచి బోధన్‌కు 169 కిలోమీటర్లు. మొత్తంగా 312 కిలోమీటర్ల దూరం. ఈ మెమూ రైలులో సిర్‌పూర్‌టౌన్ నుంచి బోధన్ వెళ్లేవారికి గరిష్టంగా ఆరు గంటల సమయం పడుతుండగా.. చార్జీ మాత్రం రూ.100 లోపే ఉండడం విశేషం.
బోధన్ రైలుకు బోర్డేది..!


