
విద్యుత్ తీగలు సరిచేస్తాం
కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తాం పొలంగట్ల వైపు కదిలిన ట్రాన్స్‌కో అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సత్ఫలితాలిస్తున్న ‘పొలంబాట’
పెద్దపల్లిరూరల్: పంటలు పండించే రైతులు విద్యుత్ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడొద్దనే ఆలోచనతో ఎన్పీడీసీఎల్ అధికారులు చేపట్టిన పొలంబాట కార్యక్రమం సత్పలితాలు ఇస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న అధికారులు.. వారి దృష్టికి వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తున్నారు. వేలాడే తీగలు, ఒరిగిన, వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేస్తున్నారు. పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారిన స్తంభాలు ఉంటే వాటిస్థానంలో కొత్త విద్యుత్ పోళ్లను అమర్చుతున్నారు. పంట పొలాలకు సమీపంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాదం పొంచి ఉందని భావిస్తే.. సత్వరమే స్పందించి వాటిఎత్తును పెంచడమో, లేక చుట్టూ రక్షణ కోసం కంచెలు ఏర్పాటు చేయడమో చేస్తున్నారు.
దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం..
జిల్లాలో చేపట్టిన పొలంబాట కార్యక్రమం సత్పలితాలనే ఇస్తోంది. ఇప్పటివరకు ప్రమాదకరంగా ఉన్న లో లెవల్ క్రాసింగ్ లైన్ల 187 పనులను గుర్తించి ఆపనులు పూర్తిచేశారు. తక్కువ ఎత్తులో పంట చేలకు సమీపంలో ప్రమాదకరంగా ఉన్న 56 ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయడం, ఎత్తు పెంచడం లాంటి పనులు చేపట్టారు. అలాగే లూస్‌లైన్లకు సంబంధించిన 232 పనులను పునరుద్ధరించడం, ఒరిగి, వంగి ప్రమాదకరంగా 45 ఉన్న విద్యుత్ స్తంభాలను సరిచేయడం చేశారు. డబుల్ ఫీడింగ్ పాయింట్ల 45 పనులు చేపట్టారు.