
ఆధునిక విద్యకు అడుగులు
పెద్దపల్లి, రామగుండంలో సమీకృత గురుకులాల ఏర్పాటు ప్రతీ స్కూల్‌కు రూ.150 కోట్లు, పూర్తయిన టెండర్లు రామగుండం, ఎలిగేడులో 25 ఎకరాల చొప్పున కేటాయింపు గతంలో హుస్నాబాద్, మంథనిలో శంకుస్థాపన చేసిన మంత్రులు 2026 దసరాకు అందుబాటులోకి తేవాలని లక్ష్యం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆధునిక బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (సమీ కృత గురుకులాలు) నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు రెండు స్కూళ్లకు శంకుస్థాపన జరగగా, మరో రెండు స్కూళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. గతేడాది నవంబ రులో మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల(సమీకృత గురుకులాలు)లకు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలోనే రెండు సమీకృత పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పూర్తవడం గమనార్హం. ప్రతీ పాఠశాలను అత్యాధునిక సదుపాయాలతో, పర్యావరణహితంగా సౌరవిద్యుత్తుతో నిర్వహించేలా నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ముందుకెళ్తుండడం విశేషం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న నాలుగు పాఠశాలలను 2026 దసరా నాటికి పాఠశాలను ప్రారంభించాలని కోరుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో..
వాస్తవానికి 4 తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మేరకు రూ.1,100 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. తొలిదశలో ఒక్కో గురుకులానికి రూ.145 కోట్ల చొప్పున వెచ్చించి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే మంథని, హుస్నాబాద్ టెండర్లు పూర్తవగా.. తాజాగా పెద్దపల్లి, రామగుండంలోనూ టెండర్లు అయ్యాయి. రామగుండం నుంచి అంతర్గాంకు వెళ్లే దారిలో సోషల్ వెల్ఫేర్ పాఠశా ల సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం 27 ఎకరాల భూమి కేటాయించింది. పెద్దపల్లి నియోజవర్గంలో ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్‌పల్లి గ్రామం వద్ద 25 ఎకరాల భూమిని కేటాయించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ గతేడాది నవంబరులోనే శంకుస్థాపన చేశారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి వద్ద 25 ఎకరాలల్లో సమీకృత పాఠశాలకు మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.150కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేయనుంది. టెండర్లు ఖరారవగానే.. తొలివిడతగా రూ.30 కోట్ల చొప్పున పనుల కోసం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
ప్రత్యేకతలు ఇవే
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను 25 ఎకరాల్లో నిర్మిస్తారు. 4 నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తారు. తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్‌బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ క్రీడల కోసం మైదానం ఏర్పాటు చేస్తారు. వచ్చే దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణం పూర్తి చే యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ స్కూల్‌లో 2,500 మందికి పైగా విద్యార్థులు, వీరికి 120 మంది టీచర్లతో బోధించనున్నారు. భవనా లు, సదుపాయాలకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు వెచ్చిస్తారు. సొంత సోలార్ విద్యుత్తుతో లిప్టులు, వీధిదీపాలు, క్లాస్‌రూమ్ ఉపకరణాల నిర్వహణ ఉంటుంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.