
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ స్కానింగ్ సేవలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని పెద్దపల్లి, సు ల్తానాబాద్, మంథని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన స్కానింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గర్భం దాల్చిన సమయం నుంచే గర్భిణులకు స్కానింగ్ సేవలు అందించేలా కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతో జిల్లాకేంద్రంలో టీఫా, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం సుమారు రూ.20 లక్షల వరకు వెచ్చించారని అధికారులు చెబుతున్నారు. నిత్యం గ్రామాల నుంచి 108 వాహనాల ద్వారా వారిని ఆస్పత్రులకు తరలించి సేవలు అందిస్తున్నారు. రోజూ సుమారు 100 మందికిపైగా స్కానింగ్ చేస్తున్నట్లు సీహెచ్ శ్రీధర్ తెలిపారు. జి ల్లాలో దాదాపు 3,465 మంది గర్భిణులు ఉన్నారని అంచనా వేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్కోసారి స్కానింగ్ చేస్తే.. సగటున రూ.వెయ్యి చొప్పున మొత్తంగా డెలివరీ అయ్యే వరకూ సుమారు రూ.6వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అదేవిధంగా గర్భం దాల్చిన తర్వాత ఒక్కో గర్భిణికి టిఫా స్కానింగ్ చేయాల్సి వస్తోంది. ఇలా మొత్తం గర్భిణులు రూ.2కోట్ల వరకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు చెల్లించాల్సి వచ్చేదని, కానీ, ఇంతటి విలువైన సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉన్నాయని వైద్యాధికారులు వివరిస్తున్నారు. మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ఆస్పత్రులతోపాటు 8 అర్బన్ ప్రాథమిక, 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోంచి ఆయా ఆస్పత్రులకు గర్భిణులను తరలిస్తున్నారు. వీరికి అవసరమైన సమయాల్లో స్కానింగ్ సేవలు ఉచితంగానే అందిస్తున్నారు.