
పారదర్శకంగా ‘ఉపాధి’
● ఈజీఎస్ పనులపై నిఘా ● అన్ని గ్రామాల్లోనూ ఏర్పాట్లు
రామగిరి(మంథని): గ్రామీణ కూలీలకు చేతినిండా పనులు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పనుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేలా ప్రణా ళిక రూపొందించాయి. పథకాన్ని పకడ్బందీగా అ మలు చేసేందుకు గ్రామస్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభు త్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉండగా తొలిసారి గ్రామ కమిటీల ఏర్పాటు కు కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
తరచూ తనిఖీలు..
సామాజిక తనిఖీ నివేదికలపై తరచూ సమీక్షించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు గ్రామ కమిటీలు ఉపాధి పనులు పర్యవేక్షిస్తాయి. అంతేకాదు.. ఏటా జరిగే సామాజిక తనిఖీ సభల్లో అవినీతిని గుర్తిస్తాయి. అవినీతి సొమ్మును రికవరీ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. జిల్లాలో మొత్తం జాబ్ కార్డులు 1,18,945 ఉండగా, ఇందులో 70,797 కారులు యాక్టివ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఐదుగురు సభ్యులతో కమిటీ..
ప్రతీ గ్రామ పంచాయతీలో ఐదుగురు సభ్యులతో కూడిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘం సభ్యులు, యూత్ సభ్యులు, ఆశ వర్కర్లు ఉంటారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాధించి జిల్లా అధికారులకు నివేదిస్తారు.
వారానికోసారి పరిశీలన
కమిటీలు వారానికోకసారి ఉపాధి పనులు పరిశీలిస్తాయి. పనుల తీరు, మంజూరు, కూలీల హాజరు, చెల్లింపులు తదితర వివరాలు సేకరించి మండల పరిషత్ అధికారులకు నివేదిస్తాయి. వారు జిల్లా అధికారులకు అందజేస్తారు. ఇకనుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతీనెల మొదటివారంలో తనిఖీలు చేయాలని, ఆ తర్వాత వివరాలను అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. తనిఖీల్లో వెల్లడైన రికవరీ నిధులను తాత్సారం చేయకుండా రాబట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
జాబ్‌కార్డుల వివరాలు
మండలం మొత్తం యాక్టివ్‌లోనివి
పెద్దపల్లి 14,561 9,804
మంథని 12,545 8,121
సుల్తానాబాద్ 11,648 6,580
కాల్వశ్రీరాంపూర్ 8,536 5,586
ఓదెల 11,511 7,045
ముత్తారం 7,452 4,803
జూలపల్లి 7,486 3451
ఎలిగేడు 4,587 2,297
ధర్మారం 12,278 7,179
కమాన్‌పూర్ 5,920 2,951
అంతర్గాం 5,878 3,751
పాలకుర్తి 9,201 5,311
రామగిరి 7,342 3,918
జవాబుదారీగా ఉంటుంది
ఉపాధిహామీ పథకంలో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఉపాధి పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. ఆదిలోనే అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. త్వరలోనే అన్ని గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశాం.
– కాళిందిని, డీఆర్డీవో

పారదర్శకంగా ‘ఉపాధి’