
నైపుణ్యం పెంచుకుంటేనే మెరుగైన బోధన
● ఉపాధ్యాయ శిక్షణకు పటిష్ట కార్యాచరణ ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధన నైపుణ్యం పెంపొందించుకుంటూ నాణ్యమైన విద్యాబోధన చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర, బాలికల హైస్కూళ్లలో ఉపాధ్యాయుల వేసవి శిక్షణ శిబిరాలను డీఈవో మాధవితో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవ మైనదని, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం వారికే ఉందన్నారు. ఈనెలాఖరు వరకు డిజిటల్ ఎడ్యుకేషన్, ఏఐ, స్కిల్స్ లెర్నింగ్ అవుట్‌కమ్స్ లాంటి అంశాల తో పాటు గణిత, సోషల్, మండల రిసోర్స్ పర్సన్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, ఐఆర్పీలకు శిక్షణ అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పచ్చిరొట్ట విత్తనాలతో భూసారం పెంపు
జీలుగ, జనుము లాంటి పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియ దున్నడం ద్వారా భూసారం పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక డీసీఎంఎస్ పాయింట్ వద్ద కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రైతులకు 50శాతం రాయితీపై విత్త నాలను పంపిణీ చేశారు. జిల్లాలోని 51 కేంద్రాల ద్వారా రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 6వేల క్వింటాళ్ల జీలుగ, 600 క్వింటాళ్ల జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, డీఏవో ఆదిరెడ్డి, శ్రీనాథ్, అలివేణి, మల్లారెడ్డి, సురేశ్‌గౌడ్ పాల్గొన్నారు.