కటింగ్ పేరుతో మోసం చేస్తే చర్యలు
● ఎమ్మెల్యే విజయరమణారావు
సుల్తానాబాద్‌రూరల్/ఓదెల: కటింగ్ పేరుతో రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే విజయరమణారావు హెచ్చరించారు. నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు నీరందించేందుకు ఎస్సారెస్పీ కాలువల పూడికతీతకు త్వరలోనే శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల పీఏసీఎస్ ఆధ్వర్యంలో దేవునిపల్లి, కొదురుపాక, నారాయణపూర్, చిన్నకల్వల(రెబ్బల్‌దేవుపల్లి)లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కోరారు. అలాగే ఓదెల మండలం పొత్కపల్లి, కనగర్తి, మడక, గుండ్లపల్లి, పిట్టలపల్లె గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. మండలంలోని శానగొండ, బాయమ్మపల్లి, ఇందుర్తి, రూపునారాయణపేట గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఆందోళన చెందవద్దన్నారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులు సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, విండో చైర్మన్‌లు దేవరనేని మోహన్‌రావు, ఆళ్ల సుమన్‌రెడ్డి, సతీశ్, మహేందర్, మూల ప్రేంసాగర్‌రెడ్డి, రవికుమార్, శంకర్, రాజన్న పాల్గొన్నారు.


