చైనామాంజాకు చెక్
గోదావరిఖని: సంక్రాంతి పండుగంటేనే గంగిరెద్దు ల విన్యాసాలు.. ఇళ్లముందు గొబ్బిళ్లు.. ఆకట్టుకునే రంగవల్లులు.. కలర్‌ఫుల్ గాలిపటాలు.. ఇంటిల్లిపాది ఆనంద డోలికలు.. పండుగ వేళ అందరి ఇళ్లలో సుఖసంతోషాలు, ఆనందాలు నిండాలని కోరుకుంటారు. అయితే ఒకరి సంతోషం మరొక కుటుంబంంలో విషాదం కారాదని పోలీసులు సూచిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో సాధారణ కాటన్ దారం స్థానంలో చైనా మాంజాలు వినియోగించడం ద్వారా ప్రాణాల మీదకు తెస్తోందని పర్యావరణ ప్రేమికులూ కలవరపడుతున్నారు. నిషేధిత దారంతో పండుగ వేళ ఆకాశంలో ఎగిరే గాలిపటాలు ఉల్లాసాన్ని పంచుతాయి. కానీ అదే దారం ఎవరికైనా తాకినా, పక్షులకు చుట్టుకున్నా ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతోంది. నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా చైనా మాంజా ను కొందరు చట్టవిరుద్ధంగా వాడుతున్నారు. దీనిద్వారా రహదారులపై వెళ్తున్న వాహనదారులు, పాదచారులు, చిన్నారులు, వృద్ధులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు.
చైనామాంజా తయారీ ఇలా..
గాజుపొడి, లోహపు కణాలతో చైనా మాంజా తయారు చేస్తున్నారు. గాలిపటాలు ఎగురవేయడా నికి బాగానే ఉన్నప్పటికీ.. అది ఎవరికై నా తగిలితే తీవ్రగాయాలు, గొంతు ప్రాంతంలో తాకితే గొంతు తెగిపోతోంది. రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మనుషులతో పాటు పక్షులూ ప్రాణాలు కోల్పోతున్నాయి.
నిషేధం ఉన్నా.. వ్యాపారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చైనా మాంజాపై నిషేధం విధించాయి. అయినా.. కొందరు వ్యాపారులు చైనా మాంజాను అక్రమంగా విక్రయిస్తున్నారు. బయటి ప్రాంతాల నుంచి రహస్యంగా తీసుకొవచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా అమ్మకా లు సాగడంతో నియంత్రణ కష్టంగా మారుతోంది. తక్కువ ధరకు దొరకడంతోపాటు దారం బలంగా ఉంటుందనే కారణంతో యువత చైనా మాంజాకు ఆకర్షితులవుతోందని అధికారులు వివరిస్తున్నారు.
విక్రయించినా, వినియోగించినా చర్యలు
రంగంలోకి దిగిన కమిషనరేట్ పోలీసులు
వివిధ దుకాణాల్లో తనిఖీలు


