పంచాయతీల్లో ‘కో– ఆప్షన్లు’
కమాన్‌పూర్(మంథని): పంచాయతీ ఎన్నికలు ముగిసి కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రతీ గ్రామ పంచాయతీ పాలకవర్గంలో ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల ఎంపికపై చర్చలు జోరందుకున్నాయి. గ్రామాల అభివృద్ధికి పాటు పడేవారికి కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయనున్నారు. ఈ పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
కో ఆప్షన్ సభ్యుల పాత్ర ఇలా..
ప్రతీ గ్రామ పంచాయతీలో ముగ్గురు కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తారు. కో ఆప్షన్ సభ్యులకు గ్రామ సభలు, పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తారు. వార్డు సభ్యుల తో సమానంగా ప్రొటోకాల్ ఉంటుంది. సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రాధాన్యం కల్పిస్తారు. నిధుల వినియోగం, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలోనూ వీరిపాత్ర ఉంటుంది. పంచాయతీలకు సలహాదారులుగా ఉంటారు.
ఎంపిక ఇలా..
పంచాయతీ పాలకవర్గ సభ్యులతో సమాన హోదా ఉన్న కో ఆప్షన్ సభ్యుల ఎంపికపై గ్రామాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ప్రభుత్వ పాలనాపరమైన అంశాలపై పట్టున్న రిటైర్డ్ ఉద్యోగి, గ్రామాభివృద్ధికి పాటుపడుతూ విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామాభివృద్ధికి ముందుడే వారిని ఎంపిక చేస్తారు. కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో సర్పంచ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల నిర్ణయం కీలకం కానుంది. ఈ పదవులపై కన్నేసిన వారు తెరవెనుక జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామాభివృద్ధికి తోడ్పడే వారికి అవకాశం
తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు
గ్రామాల్లో జోరుగా సాగుతున్న చర్చలు
జీవో రాలేదంటున్న జిల్లా అధికారులు
జిల్లా సమాచారం
మండలాలు 14
పంచాయతీలు 263
కో – ఆప్షన్ సభ్యుల సంఖ్య 789


