ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: ప్రజాసేవ చేయాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రెండుసార్లు ఓడినా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రంగాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనకు ఎలాంటి విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలు లేవన్నారు. పంటలకు సాగునీరందించేందుకు పాటుపడ్డానన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో క్వింటాల్‌కు 8 కేజీల నుంచి 10 కేజీల వరకు ధాన్యం కొనుగోళ్లలో కోతలకు పాల్పడ్డారని ఆరోపించారు. కానీ తాను ఎన్నికయ్యాక గింజకూడ కోత లేకుండా కొనుగోళ్లు చేస్తున్నామని అన్నారు.
పంటలకు నీరు కావాలె..
పంటలు చేతికందే దశకు వచ్చాయని, సాగునీటిని సరఫరా చేసేలా చూడాలని రంగాపూర్ గ్రామానికి చెందిన రాజయ్య అనే రైతు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నీటి సరఫరా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇస్తూనే పంటలను సకాలంలో సాగు చేసుకుంటే ఈ సమస్యలుండవు కదా? అని రైతులకు సూచించారు. ప్రియాంక అనే గ్రామస్తురాలు రంగాపూర్ స్టేజీ వద్ద బస్‌షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరగా.. స్పందించిన ఎమ్మెల్యే ఏర్పాటు చేయిస్తానన్నారు.
చలివేంద్రం ప్రారంభం
స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికుల దాహం తీర్చేందుకు వాకర్స్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. సభ్యులు తిరుపతి, కొమ్ము సుధాకర్, కొమురయ్య, కనకయ్యతోపాటు ఆర్టీసీ బస్‌స్టేషన్ మేనేజర్ రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


