మక్కకు పందుల బెడద
● కంకిదశలోకి పంట.. దిగుబడిపై ఆశ ● చేతికందే దశలో ధ్వంసం చేస్తున్న ఊరపందులు ● రక్షణ కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు అన్నదాతల మొర
రక్షణ కల్పించాలి
మా ఊరు శివారులో నాకున్న చేనులో మొక్కజొన్న పంట వేసిన. ఊరపందులు చేనులోపడి కంకిని కొరికి పడేస్తున్నాయి. కర్రలను విరిచేస్తున్నాయి. మాకు తీరని నష్టం కలుగుతంది. వాటి బారినుంచి పంటను కాపాడాలి. నష్టపోయిన పంటకు పరిహారం ఇప్పించాలి.
– వైద రమేశ్, రైతు, రంగంపల్లి
పంటల బీమా చేయాలి
ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంటల నష్టానికి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. ఊరపందులు చేసే నష్టం విషయాన్ని సర్కార్ దృష్టికి తీసుకెళ్లడం కష్టమే. పందులు చేనువైపు రాకుండా రైతులే రక్షణ చర్యలు తీసుకోవాలి. లేదా పెంపకందారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలి.
– అలివేణి, ఏవో, పెద్దపల్లి
ఈ ఫొటోలోని రైతు పేరు పూదరి లక్ష్మణ్. స్వగ్రామం రంగంపల్లి. తను సాగు చేసిన మొక్కజొన్న పంట కంకిపోసింది. కొద్దిరోజులైతే పంట కోయడం కోసం సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇదేసమయంలోనే ఊరపందులు చేనులోపడి పంట ధ్వంసం చేశాయి. తీరని నష్టం కలిగించాయి. చేతికందే దశలో పంట నాశనం కావడంతో శ్రమంతా మట్టిపాలైందని, పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదని లక్ష్మణ్ ఆవేదన చెందుతున్నాడు.
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న పంటకు అడవిపందులతోపాటు ఊరపందుల బెడద పట్టుకుంది. కొన్ని మారుమూల గ్రామాల్లో ఊరపందులు స్వైరవిహారం చేస్తున్నా యి. గ్రామ శివారులోని మొక్కజొన్న చేనుల్లోకి దూ రి పంట ధ్వంసం చేస్తున్నాయి. అన్నదాతకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. పెద్దపల్లి శివారులోని రంగంపల్లిలో ఈ పరిస్థితి తీవ్రస్థాయిలో ఉంది. పంట ప్ర స్తుతం కంకిపోసి కొద్దిరోజుల్లో దిగుబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఊరపందులు చేలల్లోకి దూరి మొక్కజొన్న పంటను ధ్వంసం చేయడం రైతుల్లో విషాదం నింపుతోంది.
అన్నదాతలు కాపలాగా ఉన్నా..
పందుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు రైతు కుటుంబసభ్యుల్లో ఎవరోఒకరు మొక్కజొన్న చేను వద్ద రోజూ కాపలా ఉంటున్నారు. అయినా, వారి కళ్లుగప్పి పందులు గుంపులుగా వచ్చి ఒక్కసారిగా చేనులో పడి ధ్వంసం చేస్తున్నాయి. ఈ విషయాన్ని పందుల పెంపకందారుల దృష్టికి తీసుకెళ్లినా కట్టడి చేస్తామంటున్నా.. క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టడం లేదని అంటున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులకు
ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..
పందుల బెడదతో తమకు జరుగుతున్న నష్టాల గురించి వివరిస్తూ ఫొటోలు, వీడియోలతో అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధిత రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా, తమ విన్నపాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని రైతులు రాజారాం, ప్రభాకర్, నరేశ్, తిరుపతి, కిష్టస్వామి, రవి, శంకర్ తదితరులు పేర్కొన్నారు. పోలీసు అధికారులకు సైతం ఫిర్యాదు చేసి, పందుల పెంపకందారులకు ఆదేశాలు ఇప్పించినా పరిస్థితిలో మార్పు రావడం లేదంటున్నారు.
మక్కకు పందుల బెడద
మక్కకు పందుల బెడద


