
రామగుండంలో రూ.2 కోట్ల మాఫీ
● ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ ● ఈనెలాఖరు వరకు గడువు ● జీవో జారీచేసిన ప్రభుత్వం
కోల్‌సిటీ(రామగుండం): నగరపాలక, పురపాలక సంస్థల్లో ఆస్తిపన్ను బకాయిలదారులకు రాష్ట్ర ప్ర భుత్వం చల్లటి కబురు చెప్పింది. వన్‌టైం సెటిల్‌మెంట్(ఓటీఎస్)కల్పిస్తూ జీవో నంబర్ 154ను మంగళవారం రాత్రి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ జారీచేశారు. ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈనెల 31 వరకు గడువు..
90శాతం వడ్డీమాఫీ వర్తించేందుకు ఈనెల 31వ తే దీ వరకు గడువు విధించారు. కేవలం ఐదు రోజులే గడువు మిగిలి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు బకాయిపడిన ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీమాఫీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్‌టైన్ సెటిల్‌మెంట్ స్కీమ్(ఓటీఎస్) తీసుకొచ్చారు. పన్ను చెల్లింపుదారులు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలను వడ్డీతోసహా ఈనెల 31వ తేదీలోపు చెల్లిస్తే 90 శాతం వడ్డీని మినహాయిస్తారు. మిగిలిన 10 శాతం వడ్డీని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మినహాయింపు మొత్తాన్ని భవిష్యత్తు చెల్లింపుల్లో సర్దుబాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నాలుగు బల్దియాల్లో..
రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఓటీఎస్ స్కీం బకాయిదారుల నుంచి స్పందన వచ్చేందుకు మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టారు. గడువు తక్కువగా ఉండడంతో నేరుగా బకాయిలదారుల ఇంటికే వెళ్లి ఆస్తిపన్ను చెల్లించేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
రామగుండం బల్దియాలో రూ.2.28 కోట్లు..
రామగుండం నగరపాలక సంస్థలో రూ.15.22 కోట్ల వరకు ఆస్తిపన్ను డిమాండ్ ఉండగా ఈనెల 25వ తేదీ వరకు రూ.9.88కోట్ల వరకు వసూలైంది. ఆస్తిపన్నుపై సుమారు రూ.2.28కోట్ల మేర వడ్డీ ఉండగా, ఓటీఎస్ స్కీం ద్వారా రూ.2.05కోట్ల వరకు మాఫీ కానుంది.
సద్వినియోగం చేసుకోవాలి
ఆస్తిపన్ను బకాయిలపై ప్రభుత్వం కల్పించిన 90 వడ్డీమాఫీ పథకం బకాయిదారులకు మంచి అవకాశం. గడువు తక్కువగా ఉండడంతో ఫ్లెక్సీలు, మైకులతో విస్తృంగా ప్రచారం చేస్తున్నాం. రెవెన్యూ ఆఫీసర్లు బకాయిదారుల ఇంటికే వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
– అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్‌ఏసీ), రామగుండం మున్సిపల్ కార్పొరేషన్

రామగుండంలో రూ.2 కోట్ల మాఫీ