
ఐటీపార్కు కోసం తాత్కాలిక సింగరేణి గెస్ట్‌హౌజ్‌ను పరిశీలిస్తున్న జీఎం, ఎమ్మెల్యే
గోదావరిఖని: గోదావరిఖనికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరైంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి పాలకుర్తి, అంతర్గాం, రామగుండం మండలాలకు చెందిన భూములకు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. తాత్కాలికంగా సింగరేణికి చెందిన గెస్ట్ హౌస్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించనున్నారు. ఇప్పటివరకు జిల్లాకేంద్రంలోనే రిజిస్ట్రేషన్లు చేసేవారు. అది దూరభారంతో కూడుకున్న పని కావడంతో స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రైతులు, ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఒక్కొక్కటిగా..
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో త్వరలో ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. శాశ్వత భవనం నిర్మించేవరకూ సింగరేణి బీగెస్ట్‌హౌస్‌ను ఉపయోగించనున్నారు. శాశ్వతభవనం కోసం కార్పొరేషన్ కార్యాలయం వెనక ఉన్న ఎకరం ఖాళీ స్థలాన్ని గుర్తించారు. ఇప్పటికే ఇక్కడ మెడికల్ కళాశాల ఉంది. ఇందులో 24గంటల వైద్య సేవలు అందుతున్నాయి. ఈ కళాశాలకు సింగరేణి సంస్థ రూ.500 కోట్లు కేటాయించింది. తాజాగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం కూడా మంజూరుకావడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
ప్రజలకు చేరువగా సేవలు
ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ సహకారంతో మెడికల్ కళాశాల సాధించాం. ఐటీపార్కు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కానుంది.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే
ఇకనుంచి ఇక్కడే భూముల రిజిస్ట్రేషన్లు
తాత్కాలికంగా సింగరేణి గెస్ట్‌హౌస్‌లో ఆఫీస్