నాణ్యత డొల్ల.. ప్రజాధనం గుల్ల..! | - | Sakshi
Sakshi News home page

నాణ్యత డొల్ల.. ప్రజాధనం గుల్ల..!

Nov 19 2026 1:01 AM | Updated on Nov 19 2026 1:01 AM

కొట్టుకుపోయిన జి.ములగాం పెద్దచెరువు గట్టు

చీపురుపల్లి:

నాసిరకం పనులతో అధికార పార్టీ నేతల నిధుల మేతకు చీపురుపల్లి మండలం గొల్లలములగాంలోని పెద్ద చెరువు గట్టు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అధికారపార్టీ నేతల పనితీరును ఎత్తిచూపుతోంది. జనంతో ఛీ కొట్టిస్తోంది. తుఫాన్‌ సమయంలో ప్రజలను ఆదుకునే పనుల్లోనూ నిధులు కైంకర్యం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఆర్నాబ్‌ తుఫాన్‌ వర్షాలకు ముంపుబారి నుంచి గ్రామాన్ని రక్షించుకునేందుకు పెద్ద చెరువు గట్టు(రోడ్డు)కు గండి కొట్టించిన అధికా రులు ... ఆ గండిని పూడ్చేందుకు ఎకాఎకిన నిధులు మంజూరు చేయించారు. పెద్ద చెరువు గట్టు పూడ్చే పనులు పూర్తిచేశారు. హమ్మయ్య.. రాకపోకల కష్టాలు తీరాయని ఈ ప్రాంతీయులు భావించారు. అంతే.. రెండువారాలు గడవకముందే ఎలాంటి వర్షాలు లేకుండానే బుధవారం సాయంత్రం గ్రామస్తులు చూస్తుండగానే పెద్ద చెరువు గట్టు కొట్టుకుపోయింది. లక్షలాది రూపాయల ప్రజాధనం నీటిపాలైంది. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడమే దీనికి కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు. పనులను పర్యవేక్షించాల్సిన ఇంజినీరింగ్‌ అధికారులు కనీసం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

రూ.8 లక్షలు నిధులు నీటిపాలు

కొట్టుకుపోయిన జి.ములగాం పెద్ద చెరువు గట్టు

రెండువారాల కిందట రూ.8లక్షల నిధులతో పనులు

నాసిరకం పనులతో టీడీపీ నేతల

చేతివాటం

కనీస నిబంధనలు పాటించకుండా పనులు

గ్రామస్తులు చూస్తుండగానే

కొట్టుకుపోయిన పెద్దచెరువు గట్టు

జి.ములగాంలో పెద్ద చెరువు గట్టును పూడ్చేందుకు రూ.8 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో గట్టు పూడ్చివేత పనులు పూర్తిచేశారు. అయితే, గండి పడిన స్థానంలో పైపులు పెట్టి ఎలాంటి కాంక్రీట్‌ పనులు చేయకుండా మట్టివేయడంతో... లీకేజీ అయ్యి గట్టుకొట్టుకుపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే గట్టుపై నిరంతరం జి.ములగాం, గొల్లలపాలెం, పేరిపి, ఇటకర్లపల్లి, తదితర గ్రామాలకు చెందిన వారు అంతర్‌ జిల్లా రహదారిగా వినియోగిస్తూ రణస్థలం వెళ్తుంటారు. అంతటి ప్రాధాన్యం ఉన్న గట్టు పనులు నాసిరకంగా చేయడం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల విషయపై ఇరిగేషన్‌ ఏఈను వివరాలు కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. డీఈ హరికృష్ణను సంప్రదించగా పూర్తి వివరాలు తెప్పించుకుని చెబుతానని ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement