గడువు ముగిసినా.. కదలని భూ దస్త్రాలు..! | - | Sakshi
Sakshi News home page

గడువు ముగిసినా.. కదలని భూ దస్త్రాలు..!

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

విజయనగరం గంటస్తంభం:

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వం తలపెట్టిన భూ సమగ్ర సర్వేను కూటమి నేతలు విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రైతులు భయపడేలా తప్పుడు ప్రచారాలు చేశారు. భూ సర్వేను భూతంలా చేసి చూపించారు. తీరా అధికారంలోకి వచ్చాక గతప్రభుత్వం చేపట్టిన సర్వేనే కొనసాగించారు. 22ఏ, అసైన్డ్‌, చుక్కల, ఇనాం భూ సమస్యలను పరిష్కరిస్తామంటూ గొప్పలు చెప్పారు. 30, 60 రోజుల్లో భూ సమస్యల దస్త్రాలకు పరిష్కారం చూపుతామని ప్రకటనలిచ్చారు. దీనికోసం జీఓ 659ని జారీచేశారు. వాస్తవం చూస్తే... గడువుముగిసినా విజయనగరం జిల్లాలో భూ సమస్యలకు పరిష్కారం లభించడంలేదు. అసైన్డ్‌, చుక్కల, ఇనాం, పట్టా భూముల ప్రీహోల్డ్‌ దరఖాస్తులకు గడువులోగా పరిష్కారం లభించడం లేదు.

అమలు కాని ఉత్తర్వులు :

ప్రభుత్వం జారీచేసిన జీఓ 659 ప్రకారం, రెవెన్యూ యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించి రైతులకు ఊరట కలిగించాలి. కానీ, జిల్లాలో ఆ ఉత్తర్వుల అమలు నత్తనడకన సాగుతోంది.

27 మండలాల్లో పేరుకుపోయిన అర్జీలు

జిల్లాలోని 27 మండలాల పరిధిలో భూ సమస్యల తీవ్రత ఆందోళనకరంగా మారింది. వివిధ కేటగిరీల కింద వేలాది ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితా, రికార్డుల వివాదాల్లో చిక్కుకుని ఉండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రీహోల్డ్‌, రికార్డుల సవరణ కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదైనప్పటికీ, అందులో అత్యధిక అర్జీలు ఇంకా తహసీల్దార్‌, ఆర్డీఓ లాగిన్లలోనే అపరిష్కృతంగా ఉండిపోయాయి. ముఖ్యంగా విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, శృంగవరపుకోట, నెల్లిమర్ల, రాజాం, సాలూరు వంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ భూ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

నిషేధిత జాబితా ఉచ్చులో పట్టా, అసైన్డ్‌ భూములు..

తరలరాలుగా రైతుల అనుభవంలో ఉన్న సొంత పట్టా భూములు కూడా రికార్డుల పొరపాట్ల వల్ల 22ఏ నిషేధిత జాబితాలో చేరిపోయాయి. వీటి తొలగింపునకు ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని జీఓ 659 చెబుతున్నా, జిల్లాలో ఇంకా వేలాది ఎకరాలకు విముక్తి లభించలేదు. మరోవైపు, దశాబ్దాల కిందట పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు తెచ్చిన ప్రీహోల్డ్‌ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. క్షేత్రస్థాయిలో వీఆర్వో, తహసీల్దార్‌ స్థాయి సిబ్బంది వెబ్‌ల్యాండ్‌ వివరాలు అప్‌డేట్‌ చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి రైతు లు తీవ్ర ఆర్థ్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తప్పని ఇబ్బందులు...

బ్రిటిష్‌ కాలంనాటి రీ–సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌(ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు పేరు లేకుండా చుక్కలు ఉండడంతో, జిల్లాలోని అనేక మండలాల్లో రైతులు సొంత భూములను అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం సంస్థానం పరిధిలో గతంలో ఉన్నా ఇనాం భూములు, దేవదాయ, ఇతర షరతులతో కూడిన పట్టా భూముల వివాదాలు దశాబ్దాలుగా తేలడం లేదు.

మంత్రుల మాటలు నీటిమూటలేనా...

ప్రభుత్వం జీఓ 659 తెచ్చిందని, 60 రోజుల్లో సమస్యలు తీరుతాయని మంత్రులు ప్రెస్‌మీట్‌లలో చెబుతున్నారని, కానీ ఇక్కడ మండల, ఆర్డీఓ ఆఫీసులకు వెళ్తే కనీసం ఫైల్‌ కూడా కదలడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో భూ వివరాల నమోదుకు నెలల తరబడి తిప్పుకుంటున్నారని, బ్యాంకు రుణాలు అందక, అత్యవసరాలకు భూమిని అమ్ముకోలేక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. 22ఏ నుంచి తమ భూములకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అర్ధం కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పరిష్కారానికి తక్షణ కార్యాచరణ ఏదీ?

సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు వెబ్‌ల్యాండ్‌లో తక్షణమే మార్పులు చేసి రైతులకు న్యాయం జరగాలంటే జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రామ సచివాలయాల స్థాయిలో వీఆర్వోలు, సర్వేయర్లు పాత అడంగల్‌, 1బీ రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయి విచారణ నివేదికలను నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తహసీల్దార్‌ స్థాయిలో ఆన్‌లైన్‌ దరఖాస్తు వచ్చిన రోజే లాగిన్‌లోకి తీసుకుని, 60 రోజుల గడువులోపు వెబ్‌ల్యాండ్‌ డేటాను అప్‌డేట్‌ చేసి ప్రీహోల్డ్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. కలెక్టర్‌, ఆర్డీవోలు ప్రతి వారం మండలాల వారీగా ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తేనే అన్నదాతల భూ సమస్యలను శాశ్వత మోక్షం లభిస్తుంది.

జీఓ 659 కాగితాలకే పరిమితం

22ఏ, అసైన్డ్‌, చుక్కల, ఇనాం భూముల దస్త్రాలకు కలగని మోక్షం

విజయనగరం రెవెన్యూ కార్యాలయాల్లో గుట్టలుగా పెండింగ్‌ ఫైళ్లు

ఆందోళనలో బాధిత రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement