● దైవాన్ని ఏమార్చి.. రికార్డులు మార్చి భూదందా
● దేవుడి మాన్యం కాజేసిన తెలుగు తమ్ముళ్లు
● రెండు కోట్ల భూమి వాటాగా పొందిన పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి భర్త సూర్యరావు?
● మరుపల్లిలో దేవుడి భూముల రికార్డుల మార్పులు
దేవుడి భూమి ఇదే..
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
అధికార బలం ఉంది... మంత్రి అండదండలు దండిగా ఉన్నాయి.. మన ముందు ముల్లోకాలను పాలించే దేవుడెంత?.. ఆయన భూముల ఆక్రమణ ఓ లెక్కా..? రికార్డులు మార్చేద్దాం.. ఆక్రమించేద్దాం అని కూడబలుక్కున్నారు. గజపతినగరం మండలంలోని శ్రీరామా అష్ట శివకేశవ స్వామివారి పేరిట దశాబ్దాలుగా కొనసాగుతున్న భూముల రికార్డులను మార్చేసి తమ పేరిట దఖలు పర్చుకున్నారు. దేవుడి భూమిని నేరుగా తమపేరిట రాయించుకుంటే దైబ్బెపోతాం అని తెలుసుకున్న నాయకులు.. ముందుగా ఆ భూమిని వేరేవారి పేరిట రికార్డుల్లో మార్పించి, ఆ తరువాత రెండో అంచెలో దాన్ని తమపేరు మీద మార్చుకున్నారు. దేవుడికే శఠగోపం పెట్టిన టీడీపీ నేతల బాగోతం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వారి కబ్జాపర్వం చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవుడి భూములకే కన్నం వేసిన నాయకుల తీరును చూసి ఛీకొడుతున్నారు.
● కబ్జా పర్వం సాగిందిలా...
గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలోని జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 287/1లో మొత్తం 2 ఎకరాల 87 సెంట్ల భూమి ఉండగా, ఇందులో 1 ఎకరా 94 సెంట్ల భూమి మరుపల్లి గ్రామంలో ఉన్న శ్రీరామా అష్ట శివకేశవ ఆలయం మాన్యంగా ఉంది. దశాబ్దాలుగా ఉన్న ఈ ఆలయాన్ని ఈ మధ్యనే కూల్చేసి కొత్తగా పునర్నిర్మించారు. అయితే, దేవుడి పేరుమీద ఉన్న ఈ భూమి గురించి అడిగేవారు లేకపోవడంతో ఈ భూ బకాసురుల కన్ను వాటిపై పడింది. అనుకున్నదే తడవుగా రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డుల మార్పులకు రంగం సిద్ధమైంది
● ఒన్బీ రికార్డులతో మొదలైన పథకం?
భూములు కొట్టేయాలని భావిస్తున్న బ్యాచ్ ముందుగా రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని రెవెన్యూ రికార్డుల్లో కొందరి పేర్లు నమోదుచేశారు. తద్వారా ఆ భూమిపై హక్కులు పొందడానికి పునాది వేసుకున్నారు. గతంలో కొందరు రెవెన్యూ సిబ్బంది ఈ దందాకు సహకరించినట్లు తెలుస్తోంది. దీనిద్వారా వారిపేర్లు ఒన్బీ రికార్డుల్లోకి చేర్చారు.
● చేతులు మారిన భూమి!
ఒన్బీలో తమ పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ భూమి తమదే అంటూ వారు రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకోవడం.. రికార్డులు రాసింది.. మార్చింది కూడా రెవెన్యూ వారే కాబట్టి వెనువెంటనే నిజమే.. ఇది మీ భూమే అంటూ ఆంగీకరించడం జరిగిపోయింది. ఈ పథకాన్ని చక్కగా అమలు చేసి భూములపై హక్కులను గెద్ద నారాయణరావు, గెద్ద రామారావులకు బదిలీ చేసేశారు. అనంతరం సేల్ డీడ్లు ద్వారా గెద్ద కనక, గెద్ద సూర్యనారాయణ, ఇజ్జురోతు జీవన్కుమారుల పేర్లకు.. అక్కడి నుంచి గెద్ద భాను ప్రకాష్, ఆల్తి ఇందుమతికి బదిలీ అయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూమిని ఇష్టానుసారం సర్వే నంబర్లను మార్చి సబ్ డివిజన్లుగా చేసేసి వారికి కట్టబెట్టారు. కేవలం ఒన్బీలో మినహా ఇంకెక్కడా వీరి పేర్లు లేకపోయినా రెవెన్యూ అధికారులు తమ వాటాలు పుచ్చుకుని దేవుడి భూమిని ఇలా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేశారు.
సూత్రధారులు, పాత్రధారుల గుట్టు బయటపడేలా ?
దేవుడి మాన్యం భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్లపై నమోదైందన్న ఆరోపణలు నిజమైతే, అది కేవలం భూ వివాదానికే పరిమితమయ్యే అంశం కాదు. ప్రభుత్వ భూ రికార్డుల నిర్వహణ, మతపరమైన ఆస్తుల పరిరక్షణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వే నంబర్ 287/1కు సంబంధించిన అసలు రెవెన్యూ రికార్డులు, పాత 1బీ, అడంగల్, గిఫ్ట్ సెటిల్మెంట్ పత్రాలు, సేల్ డీడ్లు, ప్రస్తుత యాజమాన్య నమోదులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. అవసరమైతే భూమి స్వభావాన్ని నిర్ధారించి, చట్టవిరుద్ధమైన మార్పులు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే, దేవుడి భూమి ఎవరి చేతుల్లో ఉంది? ఆ హక్కులు ఎలా వచ్చాయి? రికార్డులు మార్చినట్లయితే అందుకు బాధ్యులెవరు? ఈ ప్రశ్నలకు అధికారిక విచారణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు. ఆరోపణల నిజానిజాలు తేల్చి, దేవుడి మాన్యం భూమికి చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని మరుపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.


