పార్వతీపురం: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. నవంబర్ 5న పోలింగ్, అవసరమైన చోట 6న రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. నవంబర్ 7న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అనంతరం ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు
ఏర్పాట్లు ముమ్మరం
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలతోపాటు స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస, జి.ఎల్. పురం, కొమరాడ మండలాల ‘స్థానిక’ ఓట్లను ఉల్లిభద్రలోని డా.వైఎస్సార్ హార్టికల్చర్ కళాశాలలోను, పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాల ఓట్లను పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను, పార్వతీపురం, బలిజిపేట, సీతానగరం మండలాలకు సంబంధించి పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను, మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాలకు సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేశారు.
● నవంబర్ 5న పోలింగ్
● 7న ఓట్ల లెక్కింపు
డా.ఎన్.ప్రభాకరరెడ్డి


