మన్యం
మహిళలకు
సాక్షి, పార్వతీపురం మన్యం: కేన్సర్ మహమ్మారి కబళిస్తోంది. మెల్లగా శరీరాన్ని గుల్ల చేస్తోంది. చివరకు ప్రాణాలను హరిస్తోంది. ప్రధానంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్ లక్షణాలు బయటపడుతుండటం పార్వతీపురం మన్యం జిల్లా వాసులను కలవరపెడుతోంది. వ్యాధి తీవ్రత పెరిగే వరకూ గుర్తించలేకపోవడం.. జిల్లాలో సరైన వైద్యసదుపాయాలు లేకపోవడం.. అధిక ఖర్చుతో కూడుకున్న వైద్యం కావడంతో చాలా మంది తక్కువ వయస్సులోనే మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో నిర్వహించిన ఎన్‌సీడీ 4.0 సర్వేలో 223 రొమ్ము కేన్సర్, 187 గర్భాశయ కేన్సర్ అనుమానిత కేసులు గుర్తించారు. లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
7.88 లక్షల మందిని సర్వే లక్ష్యంగా..
జిల్లాలో 18 ఏళ్లు దాటిన 7.88 లక్షల మందిని సర్వే లక్ష్యంగా నిర్దేశించగా, అందుబాటులో ఉన్న 7.005 లక్షల మందికి పరీక్షల సర్వే నిర్వహించారు. మొత్తం 410 అనుమానిత కేసులు వెలుగుచూడడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. మిగిలిన వారిని కూడా గుర్తించి, కేన్సర్‌పై అవగాహన కల్పించడంతోపాటు అనుమానిత లక్షణాలున్న వారిని వైద్య పరీక్షలకు పంపించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
మారుతున్న జీవనశైలే కారణం...
ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, హార్మోన్ల మార్పులు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర వంటి అంశాలు వ్యాధికి కారణమవుతున్నాయి. వ్యాధి ఒకటి, రెండు దశల్లో గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుంది. అవగాహన లేక మూడు, నాలుగు దశల్లోనే ఎక్కువ కేసులను గుర్తించగలుగుతున్నారు. ఆ పరిస్థితిలో చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతుంది. ఆర్థిక స్తోమత లేక చాలామంది మధ్యలోనే చికిత్సను విరమించుకుంటున్నారు. జిల్లాలో కేన్సర్‌కు సంబంధించి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులో లేవు. విశాఖపట్నానికే వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల చికిత్స ఖర్చుతోపాటు, రవాణా వ్యయం కూడా అధికమవుతోంది.
లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు
రొమ్ములో నొప్పి లేని గడ్డలు, రొమ్ము పరిమాణంలో ఆకస్మిక మార్పులు, చర్మంపై ముడతలు లేదా రంగులో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇలాంటి లక్షణాలు కనిపించినంత మాత్రాన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాదు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
జిల్లాలోని 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా కేన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సర్వేలో అనుమానిత లక్షణాలు గుర్తించిన వారిని తదుపరి వైద్య పరీక్షలకు పంపించేలా చర్యలు చేపడుతున్నాం. కేన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగుపడే అవకాశాలున్నందున మహిళలు ముందస్తు పరీక్షలు చేసుకోవాలి. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
– డాక్టర్ విజయలక్ష్మి,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి
జిల్లాలో పెరుగుతున్న కేన్సర్ కేసులు
చాపకింద నీరులా వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధి
మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేసులే అధికం


