● జిల్లావ్యాప్తంగా వర్షాలు
● లోతట్టు ప్రాంతాలు జలమయం
జీగిరాంలో నీట మునిగిన పంట పొలాలు
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాను అర్నబ్ తుపాను వణికించింది. ఏకదాటిగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు కోతకు గురయ్యాయి. నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. సీతానగరం మండలం అంటిపేట వద్ద వీఆర్‌ఎస్ కాలువకు గండిపడింది. సువర్ణముఖి, నాగావళి నదులు పొంగిప్రవహిస్తున్నాయి. పలు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 108.7 మి.మీ. వర్షం కురిసింది. పాచిపెంట మండలంలో 193.0 మి.మీ., బలిజిపేటలో 164.2, సీతంపేటలో 138.2, మక్కువలో 134.8, సాలూరులో 123.6, సీతానగరంలో 120.4, పాలకొండలో 115.0, పార్వతీపురంలో 94.8 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
కూలిన చెట్లు.. విరిగిన స్తంభాలు
బూర్జ మండలం మదనాపురం–సరుబుజ్జిలి రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. పాలకొండ అగ్నిమాపక సిబ్బంది ప్రధాన రహదారిపై అడ్డంగా పడి ఉన్న చెట్టును తొలగించారు. పి.కోనవలస–పాచిపెంట రహదారిలోనూ భారీవృక్షం నేలకొరిగింది. దీంతో చాలాసేపు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందడంతో వెంటనే ఆర్‌అండ్‌బీ అధికారులను అప్రమత్తం చేసి, తొలగింపు చర్యలు చేపట్టారు. ఈదురుగాలులు, వర్షానికి విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం ఏర్పడింది. పలుచోట్ల స్తంభాలు నేలకూలాయి. వైర్లు తెగిపడ్డాయి. బలిజిపేట, మక్కువ, పాచిపెంట, సీతంపేట తదితర మండలాల్లో విద్యుత్ సరఫరాకు గంటలకొద్దీ అంతరాయం కలిగింది. ఆ శాఖ సిబ్బంది తక్షణం స్పందించి తగు మరమ్మతు చర్యలు చేపట్టారు. తుపాను నేపథ్యంలో జిల్లాలో కురుస్తున్న వర్షాలపై వివిధ శాఖలు చేపడుతున్న సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్తలను కలెక్టర్ ప్రభాకరరెడ్డి నిరంతరం పర్యవేక్షించారు.
కుమ్మేసి.. తెరిపిచ్చి...
మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం కాస్త వర్షం తెరిపిచ్చింది. ఉదయం 8.30 నుంచి రాత్రి 7 గంటల వరకు జిల్లాలో 17.52 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాచిపెంటలో 42 మి.మీ., సాలూరులో 33.8, సీతానగరం 20.3 చొప్పున కురవగా.. అత్యల్పంగా వీరఘట్టం 9.5, గుమ్మలక్ష్మీపురం 8.2, కొమరాడ 10.3 మి.మీ. చొప్పున కురిసింది.


