సిరిమానోత్సవానికి పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

సిరిమానోత్సవానికి పటిష్ట భద్రత

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

● 3,500 మంది పోలీసులతో బందోబస్తు

● స్వీయపర్యవేక్షణ చేసిన విశాఖ రేంజ్‌ ఐజీపీ గోపీనాథ్‌ జెట్టి

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్‌ ఐజీపీ గోపీనాథ్‌ జెట్టి ఆదివారం పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న తొలేళ్ల సంబరాలు, 27న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహిస్తున్న తరుణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రజల భద్రతకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 3,500 మందితో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. ఆలయం చుట్టూ ఏర్పాటుచేసిన క్యూలు, ప్రసాదం కౌంటర్లు పరిశీలించారు. దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.

బారికేడ్లు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి

సిరిమాను తిరిగే మార్గంలోకి అనుమతులు లేని వ్యక్తులు ప్రవేశించకుండా బారికేడ్లు, ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. పండగ సమయంలో ఎక్కువ మంది భక్తులు ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ రెగ్యులేషన్‌కు సుమారు 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించామన్నారు. కార్యక్రమానికి ముందు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ ఆయనకు పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ పి.కిరణ్‌ కుమార్‌, విజయనగరం డీఎస్పీ ఎస్‌.లక్ష్మణమూర్తి, మహిళా స్టేషన్‌ డీఎస్పీ ఎం.వీరకుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, వన్‌టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కే.చౌదరి, టూటౌన్‌ సీఐ టి.శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ బి.లక్ష్మణరావు, ట్రాఫిక్‌ సీఐ సిహెచ్‌.రాము, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు ఏవీ.లీలారావు, విద్యాసాగర్‌, సోషల్‌ మీడియా సీఐ శోభన్‌బాబు, దేవాదాయశాఖ ఈఓ శిరీష ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement