నీ హామీలన్నీ..
ఉత్తుత్తివేనా...!
రామభద్రపురం: ఎన్నికలు వస్తే చంద్రబాబుకు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. అభివృద్ధి, సంక్షేమం పేరుతో అబద్ధాల పుట్టగొడుగు బయటకు వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుందని తెలిసిన చంద్రబాబు ఓ వైపు పక్కా ఇళ్లు నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తామని, మరో వైపు పెన్షన్లు మంజూరు చేస్తామని, ఇంకో వైపు ఇంటి స్థలం ఇస్తామని సచివాలయాలలో దరఖాస్తులు స్వీకరిస్తూ ప్రచారాలు గుప్పించారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో ఇళ్ల మంజూరు, పెన్షన్లు తదితర సంక్షేమ పఽథకాలు మంజూరు కావని అర్ధం చేసుకున్న ప్రజలు కూటమి ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలే స్థానిక సంస్థల్లో ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి నాంది పలకనున్నాయని ఆగ్రహిస్తున్నారు.
ఇంటి స్థలం లేదు.. ఇళ్లు మంజూరు లేదు..
ముఖ్యంగా ఇళ్లు లేని పేదలకు పట్టణాల్లో రెండు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకోవడానికి పీఎంఏవై కింద ఒక్కో యూనిట్‌కు రూ.2.39 లక్షలు నిధులు ఇస్తామని కూటమి పార్టీలు హామీలు గుప్పించాయి. జిల్లాలో ఇళ్ల మంజూరు కోసం 39,559 మంది లబ్ధిదారులు అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇందులో 32,657 మందిని అర్హులుగా గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క అంగుళం స్థలం కూడా ఇవ్వలేకపోయారు. కూటమి ప్రభుత్వం కొత్త ఇళ్ల మంజూరు హామీలు గాలిలో కలిసిపోయాయని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
సూపర్ సిక్స్ పచ్చి మోసం
మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, వలంటీర్లకు రూ.10 వేలు వంటి హామీలు అమలు కాలేదు. స్థానిక ఎన్నికల ముందు కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం.. దరఖాస్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 52,090 మంది అర్హులైన లబ్ధిదారులు సచివాలయాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓ స్థాయిలో స్క్రూటీని చేసి వాటిలో 46,474 మంది స్టేట్ లాగిన్లోకి అప్రూవల్ చేశారు. 5,616 మందిని వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు. అవి ఇప్పటికీ మంజూరు కాకపోవడంతో రెండేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాక దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు తీవ్ర వేదనకు గురవుతున్నారు.
నిలిచిన పథకాలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ పెళ్లికానుక, ప్రమాద బీమా వంటి పథకాలను సమర్ధంగా అమలు చేయగా, కూటమి ప్రభుత్వం వాటిని నిలిపి వేసింది. కౌలు రైతులకు రైతు భరోసా, పంటల బీమా, పంట నష్ట పరిహారం అందడం లేదు.
పెరిగిన ధరలు
నిత్యావసర సరుకులైన బియ్యం, వంట నూనె, పప్పుల ధరలు విపరీతంగా పెరిగినా ప్రభుత్వం నియత్రించలేకపోయింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులు తమ కొంప కొల్లేరు అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
ప్రజలకు కూటమి వెన్నుపోటు
ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తరువాత ప్రజలను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటికీ హామీలు అమలుపై కదలికలేదు. యువతకు నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్ తదితర పథకాలు ఇస్తానని ప్రజలను నమ్మించి మోసం చేశారు. గత ప్రభుత్వం పాలనతో పోలిక చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
– అప్పికొండ సరస్వతి, జెడ్పీటీసీ అభ్యర్థిని, రామభద్రపురం
అమలు కాని ‘సూపర్ సిక్స్’
ఆవాస్ ప్లస్ యోజనలో గుర్తించినా నేటికీ మంజూరు కాని పక్కా ఇళ్లు
ఇంటి స్థలం హామీ మరిచిన
చంద్రబాబు


