విజయనగరం క్రైమ్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. విజయదశమి రోజున చదురుగుడిలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారిని కలెక్టర్ తన భార్యతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రాజేష్, అచ్యుతానంద శర్మలు కలెక్టర్ దంపతులకు పూర్ణ కుంభంతో గర్భగుడిలో స్వాగతం పలికారు. దేవదాయ శాఖ ఎ.డి ఆలయ ఈఓ శిరీష దగ్గరుండి కలెక్టర్ దంపతులకు శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనం చేయించారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని అమ్మవారిని కలెక్టర్ ప్రార్థించారు. అనంతరం మంటపంలో కూర్చుండబెట్టి వేద ఆశ్వీరచనం చేసి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
వీరఘట్టం: మండలంలోని సీఎస్‌పీ రహదారిలో నడుకూరు సమీపంలో కనోసా ఆస్పత్రి ఎదురుగా మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకాపల్లి అప్పలరాజు అనే కార్పెంటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన అప్పలరాజు తన మిత్రుడి బైక్‌పై వెనుక కూర్చుని ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. .ఈ ప్రమాదం జరిగినప్పుడు బైక్ వెనుక కూర్చున్న అప్పలరాజు రోడ్డుపై దూరంగా పడిపోవడంతో కాలు పాదం పూర్తిగా నుజ్జునుజ్జైంది. అలాగే కుడి కన్ను క్రింది బాగంలో ఎముకలు విరిగిపోయాయి. తక్షణమే వైద్యం కోసం బంధువులు రాజాం తరలించారు.ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని ఎస్సై షణ్ముఖరావు తెలిపారు.
కారు ఢీకొని మరో వ్యక్తికి..
గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో భూదేవిపేట జంక్షన్ వద్ద మంగళవారం మరుపల్లి గ్రామానికి చెందిన సీర రామకష్ణ(37) తీవ్రంగా గాయపడ్డాడు. రామకృష్ణ తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై మరుపల్లి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డుకు కుడివైపు మళ్లించడంతో కారు డోర్‌ను ఢీకొని రామకృష్ణ కిందపడ్డాడు. దీంతో ముఖం, ఎడమ నుదుటిపై తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రామకష్ణ బంధువులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గజపతినగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై భార్య సీర రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన వ్యక్తి మృతి
సంతకవిటి: మండలంలోని జావాం గ్రామానికి చెందిన బి.నారాయణరావు(36) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో తన అత్తవారి గ్రామమైన రాపాక లో భార్య రాజేశ్వరి, పిల్లలతో కలిసి నారాయణ రావు నివసిస్తున్నాడు. జావాం గ్రామంలో రేషన్ విడిపించేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చి తిరిగి వెళ్తుండగా పొందూరు స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు కుమార్తె దిల్లీశ్వరి, కుమారుడు విష్ణు వర్ధన్ ఉన్నారు.
లోక కల్యాణార్థం చండీయాగం
విజయనగరం క్రైమ్: లోక కల్యాణార్థం మహాలక్ష్మి చండీయాగం నిర్వహించామని బ్రహ్మర్షి యనమండ్ర వేణుగోపాల శాస్త్రి తెలిపారు. మంగళవారం స్థానిక పూల్‌బాగ్ గాయత్రీ విద్యాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే చండీయాగం, లలితా సహస్రనామ హోమం, సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.


