విజయనగరం టౌన్: గంట్యాడ మండలం దిగువ కొండపర్తి పంచాయతీ రేగూరు గ్రామానికి చెందిన నెగిలి గంగులు హత్యకేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పోలయ్య, సన్యాసమ్మ భార్యాభర్తలు. పోలయ్య తన భార్యకు చెప్పకుండా కోడిని అదే గ్రామానికి చెందిన రాములమ్మ అనే మహిళకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో భార్యాభర్తల మధ్య గురువారం రాత్రి గొడవ జరిగింది. దీంతో పక్కంటిలో ఉన్న నేగలి గంగులు (41) కలుగజేసుకుని భార్యాభర్తలను విడిపిస్తుండగా.. విచక్షణ కోల్పోయిన పోలయ్య కత్తితో గంగులుపై దాడి చేశాడు. దీంతో గంగులు అక్కడికక్కడే మృతి చెందగా.. నిందితుడు పోలయ్య పరారయ్యాడు. ఈ మేరకు అందిన సమాచారంతో ఎస్.కోట మండలం భీమవరం జంక్షన్ వద్ద నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని త్వరగా అరెస్ట్ చేసిన సీఐ టి. శ్రీనివాసరావు, గంట్యాడ ఎస్సై కె. లక్ష్మణరావు, ఏఎస్సై రమణ, హెచ్‌సీ సాంబమూర్తి, కానిస్టేబుళ్లు ప్రతాప్, ప్రసాద్‌లను డీఎస్పీ అభినందించారు.


