సీతానగరం: మండలంలోని పలు గ్రామాల్లో ఐదు రోజులుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు సూరంపేట పంచాయతీ చిన్నారాయుడుపేట బీటీ రోడ్డుపై సోమవారం కనిపించాయి. ఈ రోడ్డుపై చిన్నారాయుడుపేట, బందలుప్పి, తదితర గ్రామాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఉదయాన్నే ఏనుగులను చూసి ప్రజలు భయాందోళన చెందారు. అధికారులు స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రేగిడి సమీపంలో మరో గుంపు..
భామిని: మండలంలోని తివ్వాకొండల సమీపంలో గల రేగిడి గిరిజన గ్రామ పరిసరాల్లో ఏనుగులు సంచరించాయి. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు మైదాన ప్రాంతానికి చేరుకుంటున్నాయని, అయితే ఆహార అన్వేషణలో భాగంగా పంటలను నాశనం చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిచ్చి కుక్కల స్వైర విహారం
సంతకవిటి: మండలంలోని పుల్లిట గ్రామంలో సోమవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి నలుగురిని గాయపరిచింది. కుప్పిలి జశ్వంత్‌పై కుక్క దాడి చేస్తుండగా.. అడ్డుకునేందుకు వచ్చిన అతని తాత సూర్యనారాయణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అలాగే ఆర్.హేమలత, పి.హాసినిలను కూడా గాయపరిచింది. బాధితులు స్థానిక పీహెచ్‌సీకి వెళ్లగా సిబ్బంది వైద్యసేవలందించారు.
విజయనగరం ఫోర్ట్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ దీప్తిచంద్ కోరారు. రక్తదాన మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని న్యూలైఫ్ బ్లడ్‌బ్యాంక్‌లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు శిబిరానికి స్వచ్ఛందంగా వచ్చి, రక్తదానం చేశారు. ప్రాణాపాయంలోని మనిషికి రక్తమిచ్చి కాపాడుకోవాలనుకోవడం సామాజిక బాధ్యత అని, యువత, విద్యార్థులంతా రక్తదానం చేయాలన్నారు. కార్యక్రమంలో సుభాష్, గోవింద్ పాల్గొన్నారు.


