ఈత సరదాతో చెరువులో దిగిన ముగ్గురు చిన్నారులను మృత్యువుకాటేసింది. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. రైతు కూలీ కుటుంబాల్లో చీకట్లను నింపింది. మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదం గ్రామస్తులను విషాదంలో నింపింది. | - | Sakshi
Sakshi News home page

ఈత సరదాతో చెరువులో దిగిన ముగ్గురు చిన్నారులను మృత్యువుకాటేసింది. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. రైతు కూలీ కుటుంబాల్లో చీకట్లను నింపింది. మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదం గ్రామస్తులను విషాదంలో నింపింది.

Sep 27 2026 1:16 AM | Updated on Sep 27 2026 1:16 AM

● ప్రాణం తీసిన ఈత సరదా

● చెరువులో దిగిన ముగ్గురు చిన్నారులు మృతి

● శోకసంద్రంలో తల్లిదండ్రులు

● బుధరాయవలసలో విషాదం

బుధరాయవలస చెరువులో ఈత కోసం వెళ్లి

మృతిచెందిన చిన్నారులు

హేమచంద్రరావు, వెంకటేష్‌,

చంద్రశేఖర్‌

మెరకముడిదాం: బడి నుంచి సరదాగా సాయంత్రం ఇంటికి చేరుకున్నారు.. గబగబా బ్యాగులు ఇంటిలో పెట్టి వీధిలోకి వెళ్లారు... ఏడుగురు పిల్లలు కలిసి ఈత కొట్టేందుకు ఊరి సమీపంలోని శివాలయం పక్కన ఉన్న చిన్నచెరువుకు వెళ్లారు. అంతే.. అక్కడే కాపుకాసి ఉన్న మృత్యు కోరలకు ముగ్గురు చిన్నారులు బలయ్యారు. చెరువులో దిగిన చిన్నారులు మునిగిపోయి క్షణాల్లో ప్రాణాలు విడిచారు. ఈ విషాదకర ఘటనతో మెరకముడిదాం మండలం బుధరాయవలస ఘొల్లుమంది. నానా లేవండిరా... ఆడుకుంటామని వెళ్లి మృత్యు ఒడికి చేరిపోయారా.. జట్టుగానే మా నుంచి దూరంగా వెళ్లిపోయారా అంటూ తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... బుధరాయవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల హేమచంద్రరావు(10) 5వ తరగతి, సరిది చంద్రశేఖర్‌ (9), శంకరాపు వెంకటేష్‌ (9) నాలుగో తరగతి చదువుతున్నారు. శనివారం సాయంత్రం బడి విడిచిపెట్టాక జట్టుగా ఇంటికి చేరుకున్నారు. పుస్తకాలు ఇంటివద్ద పెట్టి ఆడుకునేందుకు వీధిలోకి వెళ్లారు. అక్కడ మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈతకొట్టేందుకు ఊరి శివారున శివాలయం పక్కన ఉన్న చిన్నచెరువుకు వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండుగా నీరు చేరింది. ముందుగా దిగిన ముగ్గురు చిన్నారులు ఈతరాక మునిగిపోవడంతో మిగిలినవారు భయాందోళనతో కేకలు వేశారు. దీంతో గ్రామస్తులు పరుగున వచ్చి చెరువులో దిగివెతికినా ఫలితం లేకపోయింది. కాసేపటికి ముగ్గురు మృతదేహాలు నీటిపై తేలడంతో ఘొల్లుమన్నారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు చెరువు వద్దకు చేరుకుని పిల్లల మృతదేహాలను చూసి కన్నీరుపెట్టారు. సమాచారం అందుకున్న చీపురుపల్లి సీఐ శంకరరావు, బుధరాయవలస ఎస్‌ఐ జె.లోకేశ్‌కుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాలకు శవపంచనామా జరిపి పోస్టుమార్టం కోసం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

● ఒక్కగానొక్కకొడుకు మృతితో...

సరిది గోవిందరావు, భారతికి ఇద్దరు పిల్లలు. వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలు చంద్రశేఖర్‌, రాజేశ్వరిని సాకుతున్నారు. పిల్లలను చదివిస్తే ప్రయోజకులవుతారని, కష్టాలు తీరుతా యని ఆశపడ్డారు. ఇంతలో కుమారుడు చంద్రశేఖర్‌ను చెరువు రూపంలో మృత్యువు కాటేయడంతో కన్నీరుపెడుతున్నారు. కుమారుడు మృతదేహాన్ని పట్టుకుని భారతి విలపించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది.

● మండల గౌరీ, త్రినాథరావు దంపతులకు హేమచంద్రరావు (హేమచందు)తో పాటు మరో బాబు ఉన్నారు. ప్రమాదంలో హేమచందు మృతితో విలపిస్తున్నారు. చదువులో చురుగ్గా ఉండే కుమా రుడు మృతితో విషాదంలో మునిగిపోయారు.

● శంకరాపు అప్పలనాయుడు, లక్ష్మిలకు ఇద్దరు బాబులు. వెంకటేష్‌ 4వ తరగతి చదువుతుండగా, పెద్దబాబు ఐదో తరగతి చదువుతున్నాడు. చిన్నబాబు మృతితో కన్నీ రు పెడుతున్నారు. ఒకే తరగతికి చెందిన చంద్రశేఖర్‌, వెంకటేష్‌ మంచి స్నేహితులు. మృత్యువులోనూ స్నేహం వీడలేదంటూ గ్రామస్తులు విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement