భక్తులకు భద్రత ఏదీ? | - | Sakshi
Sakshi News home page

భక్తులకు భద్రత ఏదీ?

Nov 16 2026 12:26 AM | Updated on Nov 16 2026 12:26 AM

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కార్తీకమాసంలో పుణ్యస్నానాలకు విశేష ప్రాధాన్యం ఉండడంతో రామతీర్థంలోని భాస్కర పుష్కరిణికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఇటీవల కురిసిన వర్షాలతో రామకోనేరు(భాస్కర పుష్కరిణి) నీటితో నిండుకుండలా దర్శనమిస్తోంది. పుష్కరిణిలో మూడు ఘాట్‌ల వద్ద భక్తులు స్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళన భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ?

ఈ మాసంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆసక్తి చూపుతారు. అయితే కోనేరులో నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో మెట్ల నుంచి నీటిలోకి దిగడం ప్రమాదకరంగా మారే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు పుష్కరిణిలో దిగాల్సిన అవసరం లేకుండా మూడు ఘాట్‌ల వద్ద పైపుల ద్వారా జల్లుల రూపంలో నీటిని అందించే షవర్‌ స్నాన సదుపాయాలు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల భక్తులు సురక్షితంగా స్నానాలు ఆచరించడంతో పాటు పుష్కరిణిలోకి దిగే ప్రమాదాన్ని నివారించవచ్చని భక్తులు చెబుతున్నారు. కనీసం ప్రధాన ఘాట్‌ వద్దనైనా తాత్కాలికంగా ఈ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.

కుళాయిల నీరు మళ్లీ కోనేరులోకే..

ప్రధాన ఘాట్‌ వద్ద కుళాయిలు ఉన్నప్పటికీ ఎప్పుడు పనిచేస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని భక్తులు ఆరోపిస్తున్నారు. పైపుల ద్వారా అప్పుడప్పుడు నీరు వచ్చినప్పటికీ స్నానం చేసే నీరు తిరిగి పుష్కరిణిలోకే చేరే పరిస్థితి ఉంది. భక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక స్నానపు ఏర్పాట్లు లేకపోవడంతో ఉన్న సౌకర్యాలు కూడా పూర్తిస్థాయిలో ఉపయోగపడడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీతారామునిపేట, దన్నానపేటకు వెళ్లే రహదారుల్లో ఉన్న ఘాట్‌ల వద్ద పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రెండు ఘాట్‌ల వద్ద మహిళలకు ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులు, స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. భక్తుల రద్దీ నేపథ్యంలో మూడు ఘాట్ల వద్ద స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు, అవసరమైన చోట బారికేడ్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

కార్తీకమాసంలో రామతీర్థానికి

పోటెత్తనున్న భక్తులు

నిండుకుండలా దర్శనమిస్తున్న భాస్కర పుష్కరిణి

మూడు ఘాట్‌ల వద్ద పొంచి ఉన్న ప్రమాదం

పుణ్యస్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement