ట్రైబల్ యూనివర్సిటీ...
ఇంజినీరింగ్ విద్యకు పెద్దపీట
● జిల్లాకు ప్రగతి ఫలాలు అందించిన వైఎస్సార్ కుటుంబం
● అందుబాటులోకి విద్య, వైద్యం
● సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
విజయనగరం జిల్లాకు ఏదైనా మంచి జరిగింది అంటే గత పాతికేళ్లలో వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనాకాలంలోనే. జిల్లాకు ఒక ప్రాజెక్టు వచ్చినా.. ఒక కాలేజీ వచ్చినా.. కొత్తగా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పడినా అదంతా వైఎస్ కుటుంబం... బొత్స సత్యనారాయణ హయాంలో వచ్చినవే అని ఘంటాపథంగా చెప్పవచ్చన్నది జిల్లా వాసుల మాట. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో కొన్ని ప్రాజెక్టులు, ఆ తర్వాత వైఎస్ జగన్ పాలనలో మరికొన్ని కాలేజీల రాకతో జిల్లా ముఖచిత్రం మారిపోయింది. అభివృద్ధి పనులు సాకారం కావడంలో జిల్లా వైఎస్సార్‌సీపీ నేతల కృషి దాగిఉంది.
రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
దశాబ్దాల నాటికల అయినా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. బొబ్బిలి, చీపురుపల్లి పట్టణాల్లో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు తమ సమీపంలోని మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాగా అవతరించింది కూడా గత ప్రభుత్వ హయాంలోనే.
చీపురుపల్లికి తోటపల్లి నీరు....
మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కృషితో తోటపల్లి ప్రాజెక్టు త్వరితగతిన సాకారమైంది. ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులు ఎదురు చూసిన తోటపల్లి ప్రాజెక్టు బొత్స కృషితో దివంగత మహా నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చొరవతో శరవేగంగా 2004లో ప్రారంభమై 2009 నాటికి 90 శాతం పనులు పూర్తి చేసు కుంది. 2004కి ముందు ఎంతోకాలంగా తోటపల్లి ప్రాజెక్టు కోసం రైతులు ఎదురు చూస్తున్నప్పటికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు. 2004లో మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి సీఎం అవ్వగానే తోటపల్లి ప్రాజెక్టుకు తొలిదశలో రూ.478 కోట్లు నిధులు విడుదల చేయడంతో త్వరితగతిన పనులు జరిగాయి. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి మండలంలో 1319 ఎకరాలు, గరివిడి మండలంలో 4,296 ఎకరాలు, గుర్ల మండలంలో 9,941 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి హారంగా నిలిచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన, పనులు ప్రారంభం కూడా గత ప్రభుత్వంలోనే సాగాయి. దీని వెనుక బొత్సతో పాటు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకుల కృషిదాగి ఉంది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులు పూర్తిచేసిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కిందని, జిల్లా అభివృద్ధిలో శాశ్వత ముద్ర వారికే దక్కుతుందని జిల్లా ప్రజల నోటి నుంచి తరచూ వినిపిస్తుంది.
గత ప్రభుత్వాలు మొదలుపెట్టి చిత్తశుద్ధి కొరవడి వదిలేసిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి తుదిరూపు ఇచ్చినది గత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వమే. రూ.834 కోట్ల బడ్జెట్‌తో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాగా దానికి సంబంధించిన భూ సేకరణ, శంకుస్థాపన, పనులు ప్రారంభించిన ఘనత గత ప్రభుత్వానిదే. వర్సిటీలో కోర్సుల అడ్మిషన్లు కూడా మొదలు పెట్టింది. నాటి విద్యాశాఖ మంత్రి బొత్స పట్టువదలకుండా కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ పనులు..అనుమతులు పూర్తి చేసి వర్సిటీకి తుదిరూపు ఇచ్చారు.
వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2007లో విజయనగరంలో జేఎన్టీయూ కళాశాలను స్థాపించారు. వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవితకు పునాదివేశారు. కళాశాల జిల్లాకు మంజూరు వెనుక బొత్స కృషి దాగి ఉంది. గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జేఎన్‌టీయూ కళాశాలను వర్సిటీగా స్థాయి పెంచారు. విద్యార్థులకు సకల విద్యాసదుపాయాలు కల్పించారు. ఇప్పుడు ఇది వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తూ వారి జీవితాల్లో విద్య, ఉద్యోగ వెలుగులు పూయిస్తోంది. ఇంజినీరింగ్ విద్యకు శాశ్వత చిరునామాగా మారింది.


