జనసేన వైపు
30 ఇయర్స్ నేత చూపు..
సాక్షి, పార్వతీపురం మన్యం: పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. తొలి విడతలో జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. ఓటర్ల జాబితాల ప్రక్రియ కూడా ఇక్కడ ముగిసింది. పార్వతీపురం, సాలూరుకు సంబంధించి కోర్టు కేసుల వల్ల ఓటరు జాబితా ప్రచురణ కాస్త ఆలస్యం అయ్యింది. తాజాగా ఇక్కడ కూడా మున్సిపల్ సమరానికి అత్యంత కీలకమైన వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాలను అధికారికంగా ప్రచురించనున్నారు. ఇందులో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో జిల్లాకు సంబంధించి సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలను కూడా చేర్చారు. దీంతో జిల్లాలో మున్సిపల్ పోరుకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం వెల్లడించారు. ఫారం–1 నోటీసుతో పాటు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను ఈనెల 22న ప్రకటించాలని తెలిపారు. 2026 జనవరి 1ని అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రూపకల్పన చేయాలని సూచించారు. రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఈ ఓటర్ల లెక్కలే కీలకం కానున్నాయి.
ఆదేశాలు రావడమే తరువాయి...
2013లో ఏర్పడిన పాలకొండ నగర పంచాయతీ ఇప్పటి వరకూ 20 వార్డులతో ఉంది. ప్రస్తుతం పునర్విభజన తర్వాత 8 పెరిగి.. 28 వార్డులతో ఎన్నికలకు వెళ్లనుంది. సాలూరులో 29 వార్డులు ఉండగా.. 32 వార్డులకు, పార్వతీపురం పాలక సంఘంలో 30 వార్డులను 36గా విభజించారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం ఒక కొలిక్కి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలు రావడం తరువాయి.. ఎన్నికల నిర్వహణకు సిద్ధం కానుంది.
కూటమిలో సీట్ల పంచాయితీ..
స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేనల్లో ఎవరికి వారు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బలాబలాలు, పోటీ చేసేందుకు ఉన్న ఆసక్తిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. పొత్తుల్లో భాగంగా జనసేన ఎక్కడ కోరుకోవాలి అన్న అంశంపైనా ఆరా తీశారు. మరోవైపు బీజేపీలో కూడా ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇక, టీడీపీలో కుర్చీల కోసం ఎదురు చూసిన వారి జాబితా చాలా పెద్దదే ఉంది. రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత పందెం బరిలో నిలిచే వారు బయటకు వచ్చే యోచనలో ఉన్నారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు కూడా ఒక్కొక్కరుగా ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. జిల్లాలో ఓ టీడీపీ సీనియర్ నేత.. 30 ఇయర్స్‌కు పైగా ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు.. జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చాలా పదవులు పొందినప్పటికీ.. కొన్నాళ్లుగా ఆయన పార్టీ నేతలతో స్థానికంగా ఉన్న విభేదాల వల్ల అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో విబేధాలు మరింత పెరిగి, వీధికి కూడా ఎక్కారు. జిల్లాలో బలమైన కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆ నాయకుడు.. జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన నాగబాబును కూడా కలిసి తన మనసులో మాట చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. చివరి నిమిషంలో అందుకు బ్రేక్ పడింది. మరికొంత మంది కూడా సీట్ల సర్దుబాటులో కలిసి వస్తుందేమో అని పక్క చూపులు చూస్తున్నారు.
మున్సిపాలిటీల్లో మోగనున్న నగారా
సాలూరు, పార్వతీపురంల్లోనూ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు


